- పదే పదే అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్..అది నోరా.. మోరా
- ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా..? ఆ మాట అనడానికి సిగ్గుండాలి
- కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు నీ బీజేపీ కేంద్ర సర్కార్ పైసలు ఇయ్యకున్నా..అవార్డులు ఇస్తుంది నీకు తెలుసా…?
– బీజేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ లో కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా… ఇది కేసీఆర్ అడ్డా..ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు బిడ్డా అని ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలు నయా పైసా తో సహా వివరించిన…కుక్క తోక వంకర అన్నట్లు పదే పదే అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్..అది నోరా..డ్రైనేజీ మోరా అని ధ్వజమెత్తారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి మీద విషం చిమ్మే మాటలే చెప్తున్నావ్, గుజరాత్ గులాం లైన ఇక్కడి బీజేపీ నాయకులు రాసిచ్చిన పాత స్క్రిప్ట్ నే ఎన్నిసార్లు చదువుతవ్ అని నిలదీశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం లో అవినీతి ఆరోపణలపై…
ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న నడ్డా ఆ మాట అనడానికి సిగ్గుండాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు నీ బీజేపీ కేంద్ర సర్కార్ పైసలు ఇయ్యకున్నా..అవార్డులు ఇస్తుంది నీకు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు ఖర్చు పెడితే…మీరు కొసిరి కొసిరి ఇచ్చింది బోడి 1200 కోట్లు మాత్రమే అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర వాటాలను మంత్రి వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం 2,92,538 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
19, 402 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఇప్పటి వరకు 11 వేల 853 కోట్లు ఖర్చు చేసి 1,92,725 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన (PMAY) పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు, ఇంటికి 1 లక్ష 50 వేల చొప్పున 2,390 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని మంజూరీ ఇచ్చి ఇప్పటి వరకు కేవలం 1,201కోట్లు మాత్రమే విడుదల చేశారనీ,అంటే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులో ఇది కేవలం 10% మాత్రమే అని తేల్చి చెప్పారు.హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటిని 8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా PMAY ద్వారా 1 లక్ష 50 వేలు రూ. ఇస్తామని చెప్పి ఇప్పటివరకు సగం నిధులు మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల 4 వేలు ఖర్చు చేసి నిర్మిస్తుండగా ఇంటికి 72 వేలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రశంసిస్తూ…ప్రధాన మంత్రి అవార్డు, హడ్కో ఎక్సలెన్స్ 2018,హడ్కో ఎక్సలెన్స్ 2019,నిర్మాణాల్లో నూతన టెక్నాలజీ ఉపయోగించినందుకు ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర గ్రామీణ, పట్టణాభివద్ధిశాఖ ఎక్సలెన్స్ అవార్డు..ఇట్లా పలు అవార్డులు, పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు.
నేషనల్ హైవేస్ నిర్మాణ నిధుల అసత్య ఆరోపణలపై…
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కోసం కేంద్ర బీజేపీ మోదీ ప్రభుత్వం కాగితాల మీద 1 లక్ష 21 వేల కోట్లు మంజూరు చేసి 9 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుండి టోల్ టాక్స్, సెస్ ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని,కేంద్రం తన జేబులోంచి ఇచ్చింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరి లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ఖర్చు లెక్కల ప్రకారం చూస్తే.. హైవే ల కోసం తెలంగాణలో ఇంకో 30 ఏళ్లకు కూడా ఇప్పుడు మంజూరు చేసిన పైసలు ఖర్చు చేసేటట్టు కనిపించడం లేదన్నారు.
రైతు బంధు…కిసాన్ సమ్మాన్ నిధి పై..
కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతు బంధు కింద 49 లక్షల మంది రైతులతో మొదలు పెట్టి…నేడు లబ్ధిదారుల రైతుల సంఖ్య 70 లక్షల మందికి చేరుకుందని వివరించారు. ఎకరానికి 10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. అదే కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి రాష్ట్రంలో మొదట 35 లక్షల మంది రైతులకు ఇచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టి ప్రస్తుతం 29 లక్షల మంది రైతులకే కేంద్రం 2 వేల చొప్పున ఇస్తుందన్నారు. కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు 9వేల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు 72 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రైతుల పట్ల ఎవరి చిత్త శుద్ధి ఏంటో రాష్ట్ర,కేంద్ర గణాంకాలు చూస్తే అర్థమవుతుందన్నారు.
ధరణి రద్దు పై..
రైతుల పాలిట వరంగా మారిన ధరణి ని రద్దు చేసి..మళ్ళీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనేది బీజేపీ ఆలోచనా అని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్ లో రైతు భూమి వివరాలు ఆన్లైన్ రికార్డు కాబట్టే రైతు బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి రైతు లబ్ధిదారులను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్రంలో మాకు తక్కువ టైం పట్టిందని మీ కేంద్ర అధికారులే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అని రైతులకు ఆసరాగా నిలబడితే..బీజేపీ అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. పేదలు,రైతులు రెండు కండ్లుగా పని చేస్తున్న కేసీఆర్ ని జైల్లో పెడతారా..ఆ దమ్ముందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచభూతాలను అమ్మకానికి పెట్టి,దేశ సంపద తన కార్పొరేట్ మిత్రులకు దోచి పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి అని ప్రశ్నించారు. బీజేపీ మిడతల దండు అసత్య ఆరోపణలు, ప్రచారాల పట్ల రాష్ట్ర ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని..వారి మోసపు మాటలు నమ్మితే అశాంతితో గోస పడతామని మంత్రి వేముల అన్నారు.