mt_logo

సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను నియమించారు: వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్‌గా కేసీఆర్ నియమించారు. కిష్టారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశాము అని గుర్తు చేశారు.

కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారు. హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగాము. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్‌ను చేయాలి అని డిమాండ్ చేశారు.

అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారన్నారు.

ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్‌ను నియమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలి. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్‌గా నియమించాలి అని ప్రశాంత్ రెడ్డి సూచించారు.