తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, అవసరాలపై వినతి పత్రాలను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది కీలక రహదారులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని మంగళవారం సాయంత్రం నీతి ఆయోగ్ సబ్ కమిటీ ప్రతినిధి బృందంలో భాగంగా కలిసి నివేదికను అందజేశారు. సమిష్టి కృషితో లోతుగా అధ్యయనం చేసి తుది నివేదిక సమర్పించిన కమిటీ సభ్యులను ప్రధాని మోడీ ఈ సందర్భంగా అభినందించారు.