తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకానికి దేశంలోని అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎలా అమలు చేశారు? అనే విషయంతో పాటు అనేక ఇతర విషయాలు తెలుసుకోవడానికి కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఇతర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఆర్ధికసాయం అందించనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6వేలు ఆర్ధికసాయం అందించనున్నారు. ఈ నగదు ప్రత్యక్షంగా రైతుల ఖాతాల్లోకి బదిలీ కానుంది. రూ. 2 వేల చొప్పున మొత్తం మూడు వాయిదాల్లో చెల్లింపు చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 12 కోట్ల మంది రైతులకు లాభం చేకూరనుంది.