నాటి జలదృశ్యం నుండి నేటి జనదృశ్యం దాకా తన వెంట ఉన్నది కార్యకర్తలేనని, ప్రతి దశలో ఉద్యమాన్ని నడిపింది వారేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ యాస, భాష పేరుతో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, గులాబీ కండువాను కప్పుకున్న వాళ్ళను అవహేళన చేశారని, వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని, శ్రీకాంతాచారి, యాదిరెడ్డి వంటి అనేకమంది బిడ్డల ప్రాణత్యాగం ఫలితమే తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో త్వరలో కళాభారతికి శంకుస్థాపన చేయబోతున్నామని, యాదగిరిగుట్టను దివ్య పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు, తెలంగాణలో పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలును అటు యాదగిరి గుట్టవరకు, ఇటు ఎయిర్ పోర్టు వరకు పొడిగించే ప్రతిపాదన ఉందని, కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో వెయ్యి కూరగాయల మార్కెట్లు కావాలని, వాటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.