రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల వచ్చాయని చెప్పుకుంటున్న రూ. 40,232 కోట్ల పెట్టుబడుల్లో అసలు నిజాలు ఏమిటి?
రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రూ. 40,232 కోట్ల పెట్టుబడుల్లో అదాని సంస్థలకు చెందిన రూ. 12,400 కోట్ల పెట్టుబడి అనుమానాస్పదంగానే ఉంది. గతంలో అదాని సంస్థ ఎన్నోసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినా.. వాళ్ళు పాటించే వ్యాపార విధానాలు నచ్చక, వాళ్లు కోరే అనుచితమైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఇష్టపడక బీఆర్ఎస్ ప్రభుత్వం అదాని సంస్థ పెట్టుబడులకు అంగీకరించలేదు.
మరొకటి గోడి కంపెనీ.. రూ. 160 కోట్ల విలువ చేసే ఒక చిన్న షెల్ కంపెనీ తెలంగాణలో రూ. 8,000 కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుంది అనే సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి.
జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించిన రూ. 9,000 కోట్ల పెట్టుబడి గత ప్రభుత్వం తీసుకొచ్చినదే మరియు వెబ్ వర్క్స్ సంస్థ ప్రకటించిన రూ. 5,200 కోట్ల పెట్టుబడి కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిదే. గోద్రెజ్ సంస్థ ప్రకటించిన రూ. 1,270 కోట్ల పెట్టుబడిలో రూ. 300 కోట్లు గత సంవత్సరం ఒప్పుకున్నదే.
అంటే, రూ. 40,232 కోట్ల పెట్టుబడుల్లో రూ. 14,500 కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నవే. మిగిలిన రూ. 25,732 కోట్లలో.. రూ. 12,400 కోట్లు అదాని సంస్థల పెట్టుబడే.. అది అనుమానాస్పదం. షెల్ కంపెనీ గోడికి చెందిన రూ. 8,000 కోట్లు తీసేస్తే మిగిలేది రూ. 5,332 కోట్లు మాత్రమే.
ఇక అరగెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ విషయానికి వస్తే.. ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.. వాళ్ళు రూ. 2,000 కోట్ల పెట్టుబడితో విస్తరించడానికి ప్రకటన చేశారు. అంటే ఇప్పుడు నికరంగా మిగిలింది రూ. 3,332 కోట్లు మాత్రమే.
ఇందులో టాటా గ్రూప్ వారు ప్రకటించిన పెట్టుబడులు ఉన్నాయి.. ఈ పెట్టుబడులకు సంబంధించిన చర్చలు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండే నడుస్తున్నాయి. పెట్టుబడుల గురించి చర్చించడానికే జనవరి 12, 2023 నాడు అప్పటి పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ను టాటా గ్రూప్‌కు చెందిన చంద్రశేఖరన్ కలిశారు. అంటే ఇప్పటికి మిగిలినవి రూ. 1,832 కోట్ల పెట్టుబడుల మాత్రమే.
మొత్తానికి చూస్తే సర్జికల్ ఇన్స్‌ట్రూమెంట్స్‌కి చెందిన రూ. 231.5 కోట్లు మరియు గోద్రెజ్‌కు చెందిన రూ. 970 కోట్ల పెట్టుబడులు మాత్రమే నమ్మదగినవిగా కనిపిస్తున్నాయి.. మిగితా రూ. 630.5 కోట్ల పెట్టుబడులు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక గోద్రెజ్ సంస్థ పెట్టుబడుల విషయానికి వస్తే.. గోద్రెజ్ సెప్టెంబర్ 2023లో రూ. 300 కోట్ల పెట్టుబడులకు సిద్దమైంది.. ఇప్పుడు రూ. 1,270 కోట్లు ప్రకటించారు.. కనుక మొత్తంగా గోద్రెజ్ నుండి కొత్తగా వచ్చినవి రూ. 970 కోట్లు.
ఇక బీఎల్ ఆగ్రో, ఇన్నోవెరా, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు కానీ పెట్టుబడుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.
మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల కొత్తగా వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 1,832 కోట్లు మాత్రమే.. అందులో 630.5 కోట్ల పెట్టుబడులు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.