mt_logo

ఉస్మానియా ఆస్పత్రి భవనం ఏ క్షణాన్నైనా కూలే ప్రమాదం!

ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఎన్ని మరమ్మతులు చేసినా ఐదేళ్లకన్నా ఎక్కువకాలం నిలబడదని, భవనంలో అనేకచోట్ల నెర్రలు వారిందని, పై కప్పులు ఏ క్షణాన్నయినా కూలడానికి సిద్ధంగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు తేల్చిచెప్పారు. భవనం ఏమాత్రం నివాసయోగ్యం కాదని ఏప్రిల్ 28నే ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు దవాఖాన భవనం గోడలు, స్లాబులను పరిశీలించిన అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఉస్మానియా ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎంఎస్-4 వార్డులోని సీలింగ్ లో కొంత మేరకు పైకప్పు కూలడంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉస్మానియా దవాఖాన పాత భవనంలో పరీక్షలు నిర్వహించి నివేదికను పంపాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ను, టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీంతో ఇంజినీరింగ్ నిపుణులు దవాఖానలో పరీక్షలు నిర్వహించారు.

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో దవాఖాన నడపడం రోగులకు, వైద్యులకు, సిబ్బందికి ఎంతమాత్రం క్షేమం కాదని, భవనం స్లాబు, గోడలు ఏక్షణమైనా కూలే ప్రమాదం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు వైద్య ఆరోగ్యశాఖకు ఇచ్చిన నివేదికలో హెచ్చరించారు. భవనం కప్పు ఇనుప దూలాల ఆధారంగా సున్నం మిశ్రమంతో నిర్మించారు. తర్వాత మరమ్మతుల పేరిట 20 నుండి 50 మి.మీ. మందం చొప్పున సిమెంట్ తాపడం చేశారు. ఇలా చేయడం వల్ల అదనపు బరువు పెరగడం తప్ప ఎలాంటి ఫలితం లేదు. కప్పు పై భాగంలో నీరు చేరి పలుచోట్ల పగుళ్ళు ఏర్పడ్డాయి. ఫ్లోరింగ్ కింది భాగంలో చాలావరకు తేమ చేరింది. కొన్ని గదుల్లో రన్నర్ లుగా కర్ర వాడడంతో పైకప్పు స్థానభ్రంశం చెందింది. ఇలాంటి గదుల్లో ఏ క్షణంలోనైనా పై కప్పు కూలే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భవనానికి అనేక చోట్ల గోడలు, కప్పుపై పెరిగిన మొక్కల కారణంగా పగుళ్ళు కూడా ఏర్పడ్డాయి. ఎన్ని మరమ్మతులు చేసినా దీని జీవితకాలం ఐదేళ్లకు మించి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *