mt_logo

ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలి..

గ్రామజ్యోతి కార్యక్రమంలో రెండవ రోజైన మంగళవారం ప్రజాప్రతినిధులంతా గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని వాటికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, కమిటీలను ఆదేశించారు. పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా బాలాపూర్ మండలం రాజాపూర్ గ్రామంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అధికారులతో కలిసి పర్యటించి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరి గ్రామాలకు వారే కథానాయకులుగా మారి గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్థానిక మహిళ ఎరుకల జంగమ్మ నివాసం ఉంటున్న రేకుల షెడ్డును చూసి చలించిపోయారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేదన్న ఆమెకు మంత్రి తక్షణ సహాయంగా రూ. 10 వేలు అందజేశారు. అంతేకాకుండా ఇల్లు నిర్మాణానికి రుణం కూడా మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాజాపూర్ పేరుకు తగ్గట్టుగా రాజాలా లేదని, ఎక్కడ చూసినా చెత్త, చెదారం, రోడ్లన్నీ బురదతో నిండిపోయాయని, పరిస్థితి మారకుంటే రోగాలు వస్తాయని మంత్రి అన్నారు. పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించడానికి యువజన సంఘాలు, మహిళా సంఘాలు నెలకు కనీసం ఒక్కరోజైనా శ్రమదానం చేయాలని సూచించారు.

గ్రామజ్యోతిలో భాగంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దత్తత తీసుకున్న నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో నిర్వహించిన గ్రామసభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తే గ్రామానికి ప్రభుత్వం తరపున రో. కోటి నజరానా ఇప్పిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా శివ్వంపేటలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మరోవైపు ఆర్ధిక మంత్రి ఈటెల కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్, సైదాపూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించారు. గత ప్రభుత్వాలు, పాలకుల మాదిరిగా ఉత్త మాటలు చెప్పేటోళ్ళం కాదని, పనులు చేసి చూపెడతామని స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *