mt_logo

గురువారం అసెంబ్లీ సమావేశాలు

ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే వైసీపీ సమైక్య తీర్మానాన్ని సభలో ప్రవేశబెట్టమని కోరగా దానికి స్పీకర్ తిరస్కరించారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం తెలంగాణ బిల్లుపై చర్చ మొదలవ్వగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యిందా? లేదా? అనే విషయంపై స్పష్టత కావాలని స్పీకర్ ను కోరారు. సభ్యుల ప్రసంగాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుందని స్పీకర్ చెప్పారు. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి కనీసం తాగడానికి మంచినీళ్ళను కూడా ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పాటుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి బుధవారం సభలో సభానాయకుడిగా మాట్లాడారా? లేక పీలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా? అనే విషయం చెప్పాలన్నారు. పదవీకాలం ముగుస్తుందని వందలాది ఫైళ్ళను క్లియర్ చేసి దగా చేశారని సీఎం కిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సమన్యాయం అంటూ డిమాండ్ లేని దీక్ష చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణకోసం నిధులు అడిగితే సీఎం ఒక్క పైసా ఇవ్వనన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును స్వాగతిస్తున్నామని, సీమాంధ్రులు మా వనరులు దోచుకున్నారని, మా ప్రాంత అభివృద్ధికే తెలంగాణ అని వివరించారు. ప్రజాఉద్యమ ఫలితమే తెలంగాణ అని సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతి అన్నారు. తెలంగాణ వస్తే మేము కోల్పోయిన ఉద్యోగాలు మళ్ళీ మాకు వస్తాయనే ఆశతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగియనుండటంతో బిల్లుపై చర్చను ఈ మధ్యాహ్నం 2గంటలకు ముగించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిసారు. బిల్లును రాష్ట్రపతికి పంపాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో సభ ఐదు నిమిషాలపాటు వాయిదా పడింది. టీ బిల్లుపై గడువు పెంచుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 30 వరకు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. దీనిపై చర్చించేందుకు రేపు మరోసారి బీఏసీ సమావేశం జరపనున్నట్లు తెలిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడ్డ అసెంబ్లీ మళ్ళీ ప్రారంభమయ్యాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన చర్య తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. తెలంగాణలో సాగుభూమి పెరిగిందని, తెలంగాణలోనే ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హరీశ్ రావును నోరు అదుపులో పెట్టుకోమని అన్నారు. సీఎం ప్రసంగం అసత్యాలతో ఉందని టీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో సభ మరో 10 నిమిషాలు వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *