mt_logo

సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు

సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడు అని గుర్తు చేశారు.

కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్‌ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? అని ఎద్దేవా చేశారు.

రేవంత్ ఆయన ఇంట్లో వాళ్ళు ఆ సంగతి గుర్తు చేయాలి. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు. నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేసిండు. బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

రైతులకు రూ. 15,000 రైతు భరోసా అన్నాడు. రూ. 4,000 ఆసరా పెన్షన్ అన్నాడు. రూ. 2,500 మహిళలకు ఇస్తామన్నాడు.. అన్ని వర్గాలను మోసం మోసం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టూ ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదు? వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా. నువ్వు చెప్పిన మాటలే ఎందుకు మర్చిపోయావు? అని హరీష్ రావు అడిగారు.

నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్ట్ చేశావు. అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్‌లో పెట్టావు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్తావు. నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.

వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటే కేసు పెట్టావు. రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా ఎగపెట్టినవ్, రూ. 4,000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు రూ. 2,500 ఎగ్గొట్టినవ్.. నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు

నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా. నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డినే. కనీసం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయారు అని అన్నారు.

విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7% బడ్జెట్ కూడా పెట్టలేదు. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.

ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్‌ట్రా పని చేద్దాం ఈ ముఖ్యమంత్రి మెడలు వంచుదాం. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం అని హరీష్ రావు పిలుపునిచ్చారు.

ఈనెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని తెలిపారు.