mt_logo

ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ముందుకు వచ్చి హాస్టల్లో దత్తత చేసుకొని పిల్లలకు సేవ చేయాలి. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే.. మానవ సేవయే మాధవ సేవ. యువత దావత్‌లు బంజేసి, హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి అని పిలుపునిచ్చారు.

చలికాలంలో విద్యార్థులు, ఆడపిల్లలు, మగపిల్లలు వేడి నీళ్లు రాక దుప్పటిలు రాక ఇబ్బంది పడుతున్నారు ఈసారి ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వలేదు. గత 4 నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదని శాసనసభ సాక్షిగా చెప్పారు ఇదేనా గ్రీన్ ఛాలెంజ్.. జీతం అగొచ్చు కానీ మెస్ బిల్లులు మాత్రం ఆగవు అన్న సీఎం మాట ఏం అయింది అని అడిగారు.

ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు. మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి. పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారు.. ప్రభుత్వం ఫెయిల్ అనిపిస్తుంది. అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు కాకపోవడం దారుణం. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు. మహాలక్ష్మి, తులం బంగారం ఎటు పొయాయ్ అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఉత్త మాటలు చెప్పానని అధికారులకు చెబుతున్నారా. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా విలువ లేదా.. గౌరవం లేదా. తక్షణమే అన్ని చోట్ల మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదు. ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లి విడుదల చేయడం లేదు అని హరీష్ రావు దుయ్యబట్టారు.

రూ. 1300 పెంచిన మెస్ ఛార్జీలు ఇప్పటికి అమలు కాలేదు.. అర్బన్ రెసిడెన్షియల్‌లో రూ. 1050 మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. 1 నుండి 7 తరగతి వరకు రూ. 1,300, 8వ తరగతికి రూ. 1500 మెస్ ఛార్జీలు ఇవ్వాలి. కాస్మటిక్ ఛార్జీలు ఇంకా రూ. 100 రూపాయలు ఇస్తున్నారు. రూ. 150 ఇవ్వాలి. ఇది 4 నెలల నుండి పెండింగ్ ఉన్నాయి. తల్లిదండ్రులు లేని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ప్రభుత్వం మరింత బాధ్యత ఉండాలి అని అన్నారు.

విద్యా శాఖ మంత్రి లేడు.. విద్యా శాఖ రేవంత్ దగ్గరనే ఉంది. సాంఘిక, గిరిజన, మైనార్టీ అన్ని శాఖలు రేవంత్ దగ్గరనే ఉన్నాయి ఈ అర్బన్ రెసిడెన్షియల్ నీ దగ్గర ఉన్న విద్యా శాఖకు వస్తుంది.. సర్వ శిక్ష అభియాన్ కింద వస్తుంది. ఢిల్లీ నుండి నిధులు వచ్చిన గల్లీలో మాత్రం ఇవ్వడం లేదు. ఏ విషయంలో కుడా మాట నిలుపుకోలేదు..చెప్పిన మాటకు క్షేత్రస్థాయిలో పొంతన లేదు అని ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో చెప్పిన మాటకు తక్షణమే మెస్ బిల్లులు, కాస్మటిక్ బిల్లులు విడుదల చేయాలి. 1వ తారీకు జీతాలు అని గొప్పలు చెప్పిన సీఎం 10 తారీకు వరకు జీతాలు వెయడం లేదు. సస్పెండ్ చేయాల్సి వస్తే సీఎంనే సస్పెండ్ చేయాలి. ఈరోజు స్కూల్‌లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పవనసుత యూత్ వారిని అభినందిస్తున్న. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా యువకులు ముందుకు రావాలి అని హరీష్ రావు పేర్కొన్నారు.