రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రైతులు దాడి చేసిన ఘటనపై హరీష్ రావు స్పందించారు.
గరీబీ హటావో అని ఇందిరా గాంధీ గారు పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నడు రేవంత్ రెడ్డి. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది అని మండిపడ్డారు.
ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు అని అన్నారు.
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ గారు హైద్రాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కనబెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చుపెడుతున్నడు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి అని దుయ్యబట్టారు.
ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైంది. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి? అని అడిగారు.
ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.