ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు అందించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి.. 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది అని అన్నారు.
10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి. ఏడాది కాంగ్రెస్ పాలనలో సాధించిన ఘనత ఇది. విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని విమర్శించారు.
హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.
ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండి అని హరీష్ రావు సూచించారు.