mt_logo

నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్‌కి అలవాటు: హరీష్ రావు

ఖమ్మం జిల్లా చింతకాని మండల ప్రొద్దుటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బొజ్యాండ్ల ప్రభాకర్ అనే రైతు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు. మళ్లీ కేసీఆర్ సార్ ప్రభుత్వమే రావాలి అని ఖమ్మం రైతులు చెప్తున్నారు అని అన్నారు.

మార్పు మార్పు అని ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం మార్పు వచ్చింది? రైతుబంధు బంద్ అయింది.. బతుకమ్మ చీరలు బంద్ అయినయ్.. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది.. కేసీఆర్ కిట్ బంద్ అయింది.. దళిత బందు బంద్ అయింది.. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు బంద్ అయినయి.. బీసీ బంధు బంద్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని గ్యారెంటీ ఇచ్చారు. భట్టి విక్రమార్క ఇంటింటికి బాండ్ పేపర్ మీద రాసి హామీ ఇచ్చాడు.ఒక్కొక్క మహిళకు రూ. 27,500 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది ఈ 11 నెలల్లో. మహిళల ఓట్లు దండుకొని మోసం చేశారు అని దుయ్యబట్టారు.

కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని మోసం చేశారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామని మోసం చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. కళ్యాణలక్ష్మీ ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా అమలు చేసి చూపించాడు కేసీఆర్. లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.

గత 11 నెలల్లో తెలంగాణలో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడింది.. బస్సు తప్ప అంత తుస్సే.. బస్సు సర్వీసులు తగ్గించి ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

ఏ ముఖ్యమంత్రి అయినా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? పాలకులు పాపం చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని అయ్యగారు చెప్తే.. నేను దేవాలయాలకు వెళ్ళాను.రేవంత్ రెడ్డి పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టి మోసం చేశాడని పాపపరిహారం చేశాను. అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు. హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి. నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటు అని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి అమలు చేస్తానన్న ఆరు గారెంటీలు ఒకటైన అమలు అయ్యాయా? రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2,000 చేసింది కేసీఆర్. రూ. 4000 పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఉన్న రూ. 2000 కూడా రెండు నెలలు ఎగ్గొట్టింది. గ్యారెంటీలు అమలు చేయనందుకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బందు పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూ. 15,000 రైతుబంధు ఇస్తామని ఉన్న రూ. 10,000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం.. ప్రతిపక్షాల గొంతు నొక్కడం. ఇగురం లేనోడు వ్యవసాయం చేస్తే వడ్లు వాగులో గడ్డి గాళ్ళలో కొట్టుకుపోయింది అంట.. ఈ రేవంత్ రెడ్డి పాలన ఇట్లనే ఉన్నది అని ఎద్దేవా చేశారు.

అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఆదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒక మాట గల్లీ కాంగ్రెస్ ఒక్క మాట. రాహుల్ గాంధీ ఏమో ఆదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆదానీ నుండి రూ. 100 కోట్ల చెక్కు తీసుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో రాహుల్ గాంధీ చెప్పాలి అని సవాల్ విసిరారు.

అంతర్గత ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆదానీ అనేవాడు తెలంగాణకు రాగలిగాడా? ఒక రూపాయి అయినా తెలంగాణలో పెట్టుబడి పెట్టగలిగాడా? అవినీతి ఆరోపణలతో అమెరికాలో ఆదానీని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అలాంటి ఆదానీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామ రైతు ప్రభాకర్ చనిపోయినప్పుడు రావాలని అనుకున్నాను, ఆరోజు రాలేకపోయాను. అందుకే ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పుల్లయ్యకు గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి రావడం జరిగింది. రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే ఆ దురాగతాలకు ప్రాణాలు విడిచిన ప్రభాకర్ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్య అని ఆరోపించారు.

విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి గారు తన నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో మరణించిన రైతుకి న్యాయం చేయమని అడుగుతే తప్పా? కరెంట్ షాక్‌తో మరణించిన ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని పుల్లయ్య అడిగితే వారిపై కేసు పెట్టారు. ఆరు గ్యారెంటీలతోపాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన అని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది అని అడిగారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ అరెస్టు చేస్తారు. చనిపోయిన రైతుకు న్యాయం చేయాలని అడిగిన పుల్లయ్యను కేసు పెట్టి అరెస్టు చేస్తారా? పోలీసులకు కూడా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఉత్సాహం చూపిన పోలీసులకు ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది అని హరీష్ రావు హెచ్చరించారు.

మంచికి మంచి చెడుకు చెడు. అన్యాయంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే అరెస్టు చేస్తే పోలీసులకు తగిన శాస్తి చేయడం తప్పదు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి, ఏ పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదు. అక్రమంగా మా కార్యకర్తలపై కేసులు పెడితే పోలీసులు ఎంక్వయిరీలు ఎదుర్కోక తప్పదు అని అన్నారు.

చింతకాని మండలానికి ఎంతో ప్రేమతో కేసీఆర్ గారు దళిత బందును ప్రకటించారు.రూ. 3200 మందికి దళిత బంధు అకౌంట్ ఓపెన్ చేసి చాలావరకు దళిత బంధు డబ్బులు అందించారు. మిగిలిన కొంతమందికి పూర్తిగా దళితుబందు రెండో విడతను విడుదల చేయాలని భట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నాం.అసెంబ్లీ సమావేశాల్లో కూడా చింతకాని మండలానికి దళిత బంధు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అని తెలిపారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు అండగా పార్టీ ఉంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. మళ్లీ కేసిఆర్ ఏ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.