mt_logo

ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నాడు: హరీష్ రావు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడన. సీఎం వికృత రూపం బట్టబయలైంది అని మండిపడ్డారు.

ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలతో అట్టుడుకుతున్నది. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లడమే తెలుసు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నావు. కొత్త హామీలు కాదు, కేసీఆర్ గారు మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలు కొనసాగించడం లేదు అని విమర్శించారు.

బతుకమ్మ చీరలు లేవు, రైతు బంధు లేదు. మేము ఇచ్చేది కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ కాలేదు, పంటలు కొనే దిక్కు లేదు. పత్తి ఎక్కడైనా కొనుగోలు చేశారా. రూ. 7,521 కనీస మద్దతు ధర అని చెప్పి మోసం చేశారు. క్వింటాల్‌కు రూ. 5 వేలకు అమ్ముకుంటున్నారు.. బోనస్ అని చెప్పి బోగస్ చేసావు అని దుయ్యబట్టారు.

అదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లో రైతులు రోడ్డెక్కారు. తక్కువ ధరకు వరి అమ్ముకునే పరిస్థితి. మక్కలు కొనుగోలు దిక్కు లేదు. సోయాబీన్ పంట కొన్నవి కూడా వాపస్ ఇచ్చే పరిస్థితి. అదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడే దుస్థితి అని ఆవేదన చెందారు.

విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసం చేశావు. నిరుద్యోగుల హామీ ఏమైంది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు అని మోసం చేశావు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యార్థుల బతుకులు ఆగం అవుతుంటే మొద్దు నిద్రపోతున్నారు అని పేర్కొన్నారు.

తక్షణం పెండింగ్ డీఏలు, పీఆర్సీ అని చెప్పి ఉద్యోగులను మోసం చేశావు. ఒక్క డీఏ ఇచ్చి దీపావళి చేసుకో అంటున్నావు. మేము క్లియర్ చేసిన డీఏ ఇచ్చి గొప్పలు చెబుతున్నావు. రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.

ఉసురుపోసుకొని వర్గాలు ఏమైనా ఉన్నాయా.. ప్రతిపక్షం మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదు. అవగాహన లేక, పరిపాలన రాక రాష్ట్రాన్ని దివాలా తీశావు. మేము పోరాటం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. రుణమాఫీ గురించి మాట్లాడితే వికృతంగా మాట్లాడారు. నా మీద బాడీ షేమింగ్ చేశారు అని అన్నారు.

మూసీ అక్రమాలు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద దాడి చేస్తున్నావు. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని పోరాటం చేస్తున్నావు. మూసీ అభివృద్ధికి కాదు, అవినీతి వ్యతిరేకం అని కేటీఆర్ చెప్పారు. ఆయన క్యారెక్టర్ దెబ్బతీసే యత్నం చేసావు. ఏడాది కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఏర్పడింది అన్నారు.

ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నడు. పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలియజేసే దుస్థితి ఏర్పడింది.. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతుబంధు కోసం రైతన్నలు, జీతాల కోసం ఆశాలు, అంగన్వాడీలు. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు, ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు, సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు, పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు.. ఇలా రాష్ట్రంలో.. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్‌ఫుల్‌గా రోడ్ల మీదకు తెచ్చినవు అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు. ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ జరగకముందే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రేవ్ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారా.. దీపావళి పండుగ జరుపుకుంటే దాడి చేశారు అని తెలిపారు.

రెయిడ్ చేసిన అధికారులే చెప్పారు. అక్కడ ఏమి దొరకలేదని.. దురదృష్టవశాత్తు కొందరు మీడియా కూడా జరగంది, జరిగినట్లు ప్రచారం చేయడం బాధాకరం. మా అభిప్రాయాలు తీసుకోకుండా మంచిది కాదు. మీడియా అలోచించాలి అని సూచించారు.

కేటీఆర్ గారు ప్రజల సమస్యల మీద కొట్లడితే, కక్ష తీర్చుకునే విధంగా ప్రభుత్వం చూస్తున్నది. మీరు ఎంత భయపెట్టిన మేము పోరాటం ఆపము. మూసీ అభివృద్ధిని ప్రారంభించింది కేసీఆర్ గారు. గోదావరి నీళ్ళు మూసీకి తెచ్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తం అంటే, అరాచకాలు, అవినీతి పాల్పడతాం అంటే సహించబోము అని హరీష్ రావు హెచ్చరించారు.

పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసే ప్రయత్నం.. కాంగ్రెస్ నాయకులు తమను తామే చంపుకునే పరిస్థితి. అధికారంలోకి వస్తే పోలీసులు కష్టాలు తీర్చితమని చెప్పారు.. మేము అదే కుటుంబం అన్నారు. ఇదెక్కడి న్యాయం అని అదితే ఉద్యోగాలు ఊడగొడుతారా? పండుగ పూట వారిని ఎందుకు ఏడిపిస్తున్నావ్. నిన్ను కంటికి రెప్పలుగా కాపాడుతున్న వారి మీద ఎందుకు అంత కష్టం అని అడిగారు.

కిరాయి మూకలుగా పోలీసులను ట్రీట్ చేస్తున్నారు.. ఇచ్చిన మాట అమలు చేయాలి అంటున్నారు. వారిని పిలుచుకొని ఎందుకు మాట్లాడటం లేదు. సెలవు కావాలంటే సర్వీసు నుండి తొలగిస్తారా.. రక్షక భటుల రక్షణ లేని రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుతున్నది అని ఫైర్ అయ్యారు.

నేరస్తుడు పాలకుడు అయితే రేవంత్ పాలన లాగా ఉంటుంది.. పోలీస్ పాలన అంటారు, మరి పోలీసుల మీద నిర్బంధం ప్రయోగిస్తే ఏమంటారు.. రేవంత్ రెడ్డి పాలన అంటారు పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో ఎవరైనా 144 సెక్షన్ పెడుతారా? బట్టలు కొనొద్దు, ఫంక్షన్ షాపింగ్ చేయవద్దా. రజాకర్ రాజ్యం లెక్కనే రేవంత్ పాలన ఉంది అని మండిపడ్డారు.

ప్రజలు అంటే ఎందుకు అంత భయం.. కంచెలు లేని పాలన అని ఆంక్షల పాలన తెచ్చారు. ఎస్పీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు పొంకనాలు కొట్టి నేడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నావు. అశోక్ నగర్‌ను శోక నగర్‌గా మార్చింది రేవంత్ రెడ్డి. పిల్లల వీపులు కమిలిపోయే విధంగా కొట్టినవు. ఇదా ప్రజా పాలన.. వ్యతిరేక వస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

ఏ ఊరికైనా పోదాం సన్నవడ్లు కొంటున్నారా? ఏ మూలన పత్తి కొన్నారు. వరంగల్, ఖమ్మం పత్తి మార్కెట్ పోదాం. అవి పట్టించుకోరు కానీ, ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీ అని వికృత ఆనందం పొందుతున్నారు. బండి సంజయ్ ఆయన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. రేవంత్ తానా అంటే, బండి తందాన అంటున్నాడు అని ఆరోపించారు.

హోం శాఖ మీదే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు. బాధ్యత పదవిలో ఉంది అవాస్తవాలు మాట్లాడటం కరెక్టేనా. రేవంత్ రెడ్డి తరుపున వకాల్తా పుచ్చుకుంటున్నావు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

ప్రజల సమస్యల గురించి ఏనాడు మాట్లాడడు. మేనిఫెస్టో గురించి మాట్లాడడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ మంచి కోరుతాడు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ గురించి బీఆర్ఎస్ కొట్లాడితే బీజేపీ ఎందుకు మాట్లాడరు. పోలీసుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు. రేవంత్ రెడ్డి అదిగో పులి అంటే, బండి సంజయ్ అదిగో తోక అంటున్నాడు అని విమర్శించారు.

కేంద్రం నుండి రూ. 500 కోట్లు 15వ ఆర్థిక సంఘం నుండి వస్తె ఎక్కడికి వెళ్లాయి.. కంట్రాక్రర్లకు ఇచ్చారు రూ. 300 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చాయి. ఎందుకు అడగరు? అని ప్రశ్నించారు.