mt_logo

బీజేపీ పాలనలో ఆకలి పెరిగింది.. పేదరికం పెరిగింది: పటాన్‌చెరులో హరీష్ రావు

పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నిక చాలా ముఖ్యం.. ఎంపీగా వెంకట్రామి రెడ్డి గారు గెలవడం ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నిజ స్వరూపం నాలుగు నెలల్లో బయట పడింది.ప్రజల్ని నట్టేట ముంచింది. బీజేపీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది.. పేదల నడ్డి విరిచింది.. పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది.. పదేళ్ల బీజేపీ పాలనలో బాగుపడ్డది ఎవరు అని ప్రశ్నించారు.

దేశంలో 157 మెడికల్ కళాశాల ఇస్తే, ఒక్కటి తెలంగాణకు ఇవ్వలేదు. కేసీఆర్ మాత్రం మన పిల్లలు మన జిల్లాలో చదవాలని సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. కేసీఆర్ వచ్చాక ఏ ఒక్కరూ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు రాలేదు.. ఇప్పుడు నీటి కష్టాలు, బిందెలు కనిపిస్తున్నాయి. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఇంటి వద్దకు వస్తె, చీపురు కట్టలు పట్టుకొని దంచాలే అని పిలుపునిచ్చారు.

కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు.. తులం బంగారం లేదు. ఎంపీలు గెలిపించండి.. వాళ్ళను ప్రశ్నించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగ భృతి అని మాట తప్పింది. స్కూటీ ఇస్తా అని మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది అని హరీష్ విమర్శించారు.

బీజేపీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చి మాట తప్పారు.. ఉద్యోగాలు ఇవ్వడంలో మోసం.. గ్యాస్ వెయ్యి పెంచి వంద దించుతారు. ఇక్కడ పోటీ చేసే బీజేపీ రఘునందన్ మాటలకు హద్దు అదుపు లేదు. ఎడ్లు ఇస్తా అన్నడు, నాగలి ఇస్తా అన్నాడు.. ఎన్నో చెప్పాడు. అందుకే మొన్నటి ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ఓడగొట్టారు.. దుబ్బాకలో చెల్లని రూపాయి పటాన్‌చెరులో చెల్లుతుందా అని అడిగారు.

వెంకట్రామి రెడ్డి నాన్ లోకల్ అని ప్రచారం చేయడం సరికాదు. ఇక్కడి వ్యక్తి . ఇక్కడే ఇల్లు ఉంది.. ఇక్కడే కుటుంబం ఉంది. నాడు జడ్పీటీసీగా ఇక్కడ రఘునందన్ ఎలా పోటీ చేశారు అని ప్రశ్నించారు

ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిందని అబద్ధాలు చెప్పారు. నిజం ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్ కలిశాయి.. ఇద్దరు కలిసి బీఆర్ఎస్‌ను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి అని పేర్కొన్నారు.

వెంకట్రామి రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించాలి. నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కడతా అన్నారు. నెల రోజులు కష్టపడి వెంకట్రామి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. అబద్ధాలు ప్రచారం చేసి గెలవాలనుకునే వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నా అని అన్నారు.