
విద్యార్థుల ఆత్మబలిదానాలు.. నాలుగు కోట్లమంది జనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదినుంచీ వివక్ష చూపుతూనే ఉన్నది. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారంటూ పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఆనాటినుంచీ నేటివరకూ ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చలేదు. తెలంగాణ పురోగతికి పైసా సాయం చేయలేదు.
రాష్ట్రాల్లో వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయంలోనూ మోదీ సర్కారు తెలంగాణకు మొండిచెయ్యే చూపింది. తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చాం.. రాష్ట్ర అభివృద్ధిలో తమ పాత్రకూడా ఉన్నది అని పదేపదే మోదీ చెప్తున్న మాటలు డొల్లేనని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. బీజేపీపాలిత ప్రాంతాలతో పోల్చితే తెలంగాణకు వచ్చిన సాయం చాలా స్వల్పమని తేల్చింది. ఈ ఏడాదికూడా మోదీ సర్కారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయంలో తెలంగాణపై వివక్ష కొనసాగిస్తున్నదని వెల్లడించింది.
కాగ్ నివేదికలో బయటపడ్డ నిజం ఇదే!
దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన సా యాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను కాగ్ తాజాగా విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తెలంగాణకు కేంద్రం నుంచి అందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం కేవలం రూ.13,179 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.41,001 కోట్లు అందుతాయని భావించిన తెలంగాణ సర్కారుకు కేంద్రంనుంచి రిక్తహస్తమే అందింది.

రాష్ట్ర అంచనాలో కేవలం 32 శాతం మాత్రమే సాయం చేసి మోదీ సర్కారు చేతులు దులుపుకొన్నది. కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం నుంచి రాష్ర్టానికి అందే గ్రాంట్ బడ్జెట్ అంచనాలో 50 శాతానికి మించకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో మోదీ సొంత రాష్ట్రానికి సాయం వదరలా పారించారు. కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.13,371 కోట్ల సాయం అందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు గత 5 నెలల్లో ఏకంగా రూ.13,990 కోట్ల సాయం అందించినట్టు కాగ్ వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణకు రూ.3,009 కోట్లు మాత్రమే విదిల్చింది.
తెలంగాణతో పోలిస్తే ఐదు నెలల కాలంలో గుజరాత్‌కు రూ.10,362 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.10,981 కోట్లు అధికంగా నిధులు అందించిన కేంద్రం.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు సైతం తెలంగాణ కంటే ఎక్కువగానే సాయం చేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. అంటే దేశంలోనే కేవలం తెలంగాణకు మాత్రమే మోదీ సర్కారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయంలో వివక్ష చూపిందని కాగ్ నివేదికలో సుస్పష్టం అవుతున్నది. తెలంగాణ బీజేపీ నాయకులు కాగ్ నివేదిక చదివి.. ఇకనైనా కేంద్రంనుంచి రాష్ట్రానికి అందే సాయంపై పోరాడాలని తెలంగాణ సమాజం కోరుతున్నది.