నాడు.. తెలంగాణ అంటే కరువు ప్రాంతం. సాగునీటికి గోసపడ్డ గడ్డ. తలాపునే గోదావరి, కృష్ణా నదులు పరుగులు పెడుతున్నా.. మన భూములకు చక్కనీరు అందని దైన్యం. సమైక్య పాలకు వివక్షకు బలైన భూమి. కానీ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్‌తో జలకళను సంతరించుకొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, చెక్‌డ్యాంల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో నీళ్లులేక బోసిపోయిన నేలపై జలసవ్వడి వినిపించింది.
నాడు.. ఒక పంటకే నీళ్లు లేని పరిస్థితినుంచి నేడు మూడు పంటలకూ సరిపడా నీళ్లిచ్చే స్థాయికి జలవనరులు అభివృద్ది చెందాయి. తెలంగాణ సర్కారు విప్లవాత్మక చర్యలతో భూగర్భ జలాలూ రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి. అడుగంటిన బావుల్లోకూడా చేతికందే స్థాయికి నీటిమట్టం పెరిగింది. అందుకే ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవకున్నా తెలంగాణలో నీటివనరులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. లోటు వర్షపాతం నమోదైనా రాష్ట్రంలో జలాశయాలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. దేశంలోనే రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ విషయంసెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో వెల్లడైంది.
ఇది కేసీఆర్ జలవిజయం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నీటినిల్వలపై సీడబ్ల్యూసీ అధ్యయనం నిర్వహించి, ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఇక్కడి జలాశయాల్లో 68.3శాతం నీటి నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. 14.6 శాతం నీటి నిల్వలతో గుజరాత్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్ రెండోస్థానంలో ఉన్నా ఆ రాష్ట్రంలో మనకంటే 54శాతం తక్కువగా నీటి నిల్వలు ఉండటం గమనార్హం. అలాగే, ఐదు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని నీటినిల్వలు పదేండ్ల సగటు కంటే తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ నివేదికలో వెల్లడైంది. ఇక తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశాలాంటి రాష్ట్రాల్లో నీటినిల్వలు మైనస్‌లో ఉండటం గమనార్హం.
తెలంగాణలోని జలవనరుల్లో నీటినిల్వలు పెరిగేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన విప్లవాత్మక విధానాలే కారణమని సాగునీటి పారుదల రంగం నిపుణులు పేర్కొంటున్నారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణంలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో నీటినిల్వలు పెరిగేందుకు దోహదపడ్డాయని చెప్తున్నారు. వరణుడు కరుణించకున్నా తెలంగాణలో అన్నదాతలు మొగులు మొఖం చూడకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అంటున్నారు. ఇది కేసీఆర్ సాధించిన జలవిజయం అని కితాబిస్తున్నారు.