ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేరు చెబితేనే తెలంగాణకు బద్ధవ్యతిరేకి అని ఎవరైనా చెప్తారు. అధికారంలో ఉండగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత ఆయనది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచివేసిన చరిత్ర బాబుది. కరెంట్ చార్జీలు తగ్గించాలని ఆందోళనబాటిన పట్టిన తెలంగాణ రైతులను కాల్చి చంపించిన కఠినత్వం ఆయనది. అలాంటి బాబు నోట ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి మాట వినిపిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దని పట్టుబట్టిన ఆ నోటివెంటే తెలంగాణ సాధించిన ప్రగతిపై ప్రశంసాపూర్వక మాటలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లోకి వెళ్లిపోతుందన్న మనిషే నేడు తెలంగాణ వెలుగుజిలుగులను వేనోళ్ల పొగుడుతున్నారు. వ్యవసాయం దండుగ అన్న ఆ నోరే.. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం పండుగైందని ప్రశంసిస్తున్నది. ఇది సీఎం కేసీఆర్ పదేండ్లలో సాధించిన అభివృద్ధి.. ఇది దేశంలోనే అతి తక్కువ వయసున్న రాష్ట్రం సాధించిన పురోగతి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందనేందుకు బాబు మాటలే మచ్చుతునక.
తెలంగాణ అభివృద్ధి పై చంద్రబాబు ఏమన్నారంటే?
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర సర్కారు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇలా చేసిన రాష్ట్రాలకు ఆర్థిక ప్రోత్సాహం కూడా ఇస్తున్నది. అయితే, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెట్టేదిలేదని తేల్చి చెప్పారు. కేంద్రం ఇన్సెంటివ్స్ కోసం తమ రైతులను బలిచేయబోమని స్పష్టం చేశారు. అన్నదాతల కోసం వేలకోట్ల సబ్సిడీని తృణప్రాయంగా వదులుకొన్నారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు. రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటుంది’.. అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనతీరును ప్రశంసించారు. తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని, రైతులను ప్రేమిస్తున్నదని.. ఫలితంగానే తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ది జరిగిందనేందుకు అక్కడ పెరిగిన భూముల రేట్లే ఉదాహరణ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో వంద ఎకరాలు కొనేపరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమను చంద్రబాబు తన మాటలతో యావత్తు తెలుగు సమాజం కళ్లకుగట్టారు.