తెలంగాణలో కరువు పేరు చెబితేనే ఠక్కున గుర్తొచ్చే పేరు పాలమూరు. తలాపునే గోదారి ఉన్నా సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిపోయింది. నాటి పాలకుల కుట్రలతో ప్రాజెక్టులకు నోచక ఎడారిని తలపించింది. దీంతో అన్నదాతలు కష్టాల, కన్నీళ్లసాగు చేయలేక కాడివదిలేశారు. పిల్లాజెల్లను ఊర్లో వదిలి వలస బాటపట్టారు. పాలమూరు ఈ కన్నీళ్ల గోస వెనుక ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారే మాజీ సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. కల్వకుర్తి ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు కుట్ర చేస్తే.. జలయజ్ఞం పేరుతో వైఎస్ పాలమూరుకు తీరని అన్యాయం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయారు. మన పాలమూరు పేరుచెప్పి రుణాలు తీసుకొచ్చి.. ప్రతిఫలాలను మాత్రం వారి సొంత ప్రాంతాలకు చేరవేశారు. మొత్తంగా తెలంగాణకు అందునా పాలమూరుకు భారీ ధోకా ఇచ్చారు. కానీ, ఉద్యమ సమయంనుంచీ పాలమూరు వెన్నంటే ఉన్న సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు బీడుభూములను పచ్చబడగొట్టారు. పాలమూరు ఏండ్లనాటి వలసలగోసకు శాశ్వత పరిష్కారం చూపారు. సీఎం కేసీఆర్ విజన్‌తో రూపుదిద్దుకొంటున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో ఇప్పుడు సీమాంధ్రుల కుట్రలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.
చంద్రబాబు చేసిన కుట్ర ఇదే!
– చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో పాలమూరును దత్తత తీసుకొన్నా.. ఒక్క ప్రాజెక్టూ కట్టకుండా కుట్రలు, కుతంత్రాలు పన్నారు.
-కల్వకుర్తి ప్రాజెక్టును కేవలం 25 టీఎంసీలతో కట్టేందుకు ప్లాన్ రూపొందించారు. అంటే కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చేలా కల్వకుర్తికి ప్లాన్ చేశారు. అయినా దాన్ని పూర్తిచేయకుండా శిలాఫలకం వద్దే అది ఆగిపోయేలా చంద్రబాబు పకడ్బందీ ప్లాన్ చేశారు.
-రాయలసీమకు ఆల్మట్టినుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు విజ్ఞప్తి చేసిన బాబు ..జూరాల ప్రాజెక్టు ముంపు అంశంపై మాత్రం కర్ణాటకకు ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదు.
– కర్ణాటకలోని ముంపు బాధితులకు రూ.40 కోట్లు చెల్లించకుండా జూరాలకు కర్ణాటక అన్యాయం చేసేలా బాబు స్కెచ్ వేశారు. దీంతో 11 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జూరాలలో ఏనాడూ 7 టీఎంసీలకు నీళ్లు మించలేదు. ఫలితంగా పాలమూరుకు సాగునీటి గోస తప్పలేదు.
-పాలమూరు కరువు, వలసలను సానుభూతిగా చూపి ప్రపంచ బ్యాంకు నుంచి దండిగా రుణాలు తీసుకొచ్చిన చంద్రబాబు.. వాటిని జూరాల, కల్వకుర్తికి ఖర్చు చేయలేదు. వాటితో ప్రాజెక్టులను ముందుకు నడపలేదు. కానీ.. తన పురిటిగడ్డ సీమకు ఇక్కడి నీటిని తరలించుకుపోయి పాలమూరును కరువుసీమగా మార్చేశారు.
పాలమూరుకు వైఎస్ చేసిన ద్రోహం ఇదే!
-చంద్రబాబునాయుడు తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా గద్దెనెక్కిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పాలమూరుకు తీరని అన్యాయం చేశారు.
-జలయజ్ఞంలో భాగంగా కృష్ణా బేసిన్‌లో 5 ప్రాజెక్టులను ప్రతిపాదించి.. నిధుల విడుదలలో తీవ్ర వివక్ష చూపారు.
-సీమాంధ్ర ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్య జాబితాలో చేర్చడంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులను రెండో జాబితాలో చేర్చి కుట్రల కత్తులు దూశారు.
-ఏపీ ప్రాజెక్టులకు నిధుల వరద పారించి.. వారి పంటలకే సాగునీళ్లను అందించారు. తెలంగాణ. .అందునా పాలమూరు పంటలను పడావుబడగొట్టారు.
– ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ పేరుతో తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించే భారీ కుట్ర చేసింది వైఎస్సారే.
మొదట పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని మొత్తంగా 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. అనంతరం కుట్రపూరితంగా దీని సామర్థ్యాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచుకొనేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవల్ 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచడంతోపాటు లైనింగ్ లేని కెనాల్‌ను ప్రతిపాదించి అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పరోక్షంగా 70 వేలకు పెంచారు. అలాగే, పోతిరెడ్డిపాడు వద్ద అప్పటికే ఉన్న నాలుగు గేట్లను తొలగిస్తామని చెప్పి ఆ మాటే మర్చిపోయేలా చేశారు. అనంతరం దానికి 10 గేట్లను బిగించి.. పాలమూరును కోలుకోలేకుండా దెబ్బ తీశారు. -పాలమూరు కరువు తీర్చేందుకు తెలంగాణవాదులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకం ప్లాన్ రూపొందించి వైఎస్‌కు ఇస్తే దాన్ని ఆయన చెత్తబుట్టకే పరిమితం చేశారు. ఇప్పటికే ఎన్నో ఎత్తిపోతలు వచ్చాయని.. చూద్దాం అంటూ పాలమూరు గొంతు నులిమారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ధోకా ఇచ్చారు.