mt_logo

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశమే ఆశ్చర్యపోతుంది: మంత్రి కేటీఆర్

  • దళిత బంధు పథకానికి  రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు
  • వేములవాడ నియోజకవర్గంలో 2,859.34 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ

సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పర్యటించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు బాబు జగ్జీవన్ రామ్  విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ ఆవిష్కరించారు. బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ లో  124 మంది చిరు వ్యాపారులకు మంత్రులు ఆర్థిక సాయం అందజేశారు. దళిత బంధు పథకం కింద పలువురు లబ్ధి దారులకు వాహనాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ప్రసంగించారు. సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రామ్ అని మంత్రులు కొనియాడారు.  భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీ కరించడంలో  కీలక పాత్ర పోషించారన్నారు. జగ్జీవన్ రామ్ జీవితమే ఒక స్ఫూర్తి దాయకమన్నారు. వారి స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన సాగుతున్నదని మంత్రులు చెప్పుకొచ్చారు.

పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దళితుల బాగుకోసం దేశంలో ఎవరూ చేయలేని విధంగా సీఎం కేసీఆర్‌ గారు దళితుల ఆత్మబంధువుగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.తొలి దశలో ప్రభుత్వం అందించిన సాయంతో లబ్ధిదారులు ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారన్నారు. గత 50 ఏళ్ల ప్రభుత్వాల పాలనలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

దళితబంధు పథకానికి  రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు కేటాయించారని. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని ప్రయోజనం చేకూరుతుందని,  నియోజకవర్గానికి 1100 మందికి లబ్ధి పొందుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న పథకాలతో  దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని అన్నారు. 

పోడు రైతులకు పట్టాలు పంపిణీ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1614 మంది పోడు రైతులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి, గంభీరావుపేట మండలాలు, వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, కోనరావుపేట, మానాల గ్రామాల్లో 2,859.34 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించారు.