mt_logo

ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు

  • పేషెంట్ లోడుకు అనుగుణంగా తగిన వైద్య సిబ్బంది
  • జీవో నెంబర్ 142 ను గురువారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 
  • సూపర్‌న్యూమరీ గా 1712 పోస్ట్‌లు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో నెంబర్ 142 ను గురువారం విడుదల చేసింది.

డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో మానవ వనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు అనుమతించింది. పేషెంట్ లోడుకు అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడం జరిగింది.  కోటి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్ఓ మాత్రమే ఉండేవారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యారోగ్య అధికారుల పెంపును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.

ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్ఓ (DMHO) లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ  జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 6 డీఎంహెచ్ఓ లు ఉంటారు. కొత్త డీఎంహెచ్ఓ లను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 డీఎంహెచ్ఓ లు ఉంటారు.

రాష్ట్రంలో 636 పీహెచ్‌సీలు  ఉండగా, ఇందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో పిహెచ్‌సిలను ఏకరీతి సిబ్బంది నమూనాను కలిగి ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్‌రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలచే నిర్వహిస్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్‌రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పిహెచ్‌సిల అవసరం ఏర్పడింది. ఈ 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేసింది. 

రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యుపీహెచ్‌సీ) బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ లను TVVP ఆసుపత్రుల పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి లో ఉన్న ప్రభుత్వ టీ.బీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.

1712 పోస్ట్‌లు సూపర్‌న్యూమరీ పోస్ట్‌లుగా మార్చబడ్డాయి.  మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. కాబట్టి, పీహెచ్‌సీలు మరియు ఇతర సంస్థలలో మంజూరు చేయబడిన ఎంపీహెచ్ఏ (F) పోస్టుల స్థానం మారదు.

ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో పేషెంట్ లోడ్ కు అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది.