నాడు ఎక్కడజూసినా నెర్రవారిన నేలలు.. ఎండిపోయిన జలవనరులు.. కరువు కరాళ నృత్యాలు.. ఆకలి కేకలు.. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే అని పాడుకొనే పాటలు.. కానీ సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ దేశానికి అక్షయపాత్రగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు.. మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటులాంటి రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ పచ్చబడింది. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేసి.. పరుగులు పెడుతున్నది. ఒకనాడు ఆకలి కేకలతో అలమటించిన తెలంగాణ నేడు..దేశానికే అన్నంగిన్నెగా మారిపోయింది. నేడు తాను కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ట్రాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తీవ్ర బియ్యం కొరత ఏర్పడింది. ఆ రాష్ట్రాలు కేంద్రాన్ని వేడుకున్నా కనికరించలేదు. ఈ పరిస్థితిల్లో ఆ రాష్ట్రాలకు తెలంగాణే కల్పతరువులా కనిపించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా బియ్యం సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ఒకప్పుడు బీళ్లతో.. నోళ్లు తెరిచి గింజ కూడా పండించలేక పడావుపడిన తెలంగాణ వ్యవసాయ భూములు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ దీక్షాదక్షత ఫలితంగా దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. స్వరాష్ట్ర సాధన ఫలితాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్తున్నాయి.
తెలంగాణ వెలుగురేఖ
కొవిడ్, ఆ తర్వాత సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, ఇతర పరిణామాల నేపథ్యంలో అనేక రాష్ట్రాల వద్ద బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో తమకు ఎఫ్‌సీఐ నుంచి బియ్యం పంపిణీ చేయాలని అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కావాల్సినంత ధర ఇస్తామనిచెప్పాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు కోరినా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క గింజ కూడా ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. క్వింటాకు రూ.3,400 ఇస్తామని రాష్ట్రాలు చెప్పినా వినలేదు. కానీ ఇథనాల్ కంపెనీలకు మత్రం కేవలం రూ.2 వేలకే ఇచ్చి తన కార్పొరేట్ బుద్ధిని చాటుకున్నది. ఇదే సమయంలో తెలంగాణ తోటి రాష్ట్రాలకు వెలుగు రేఖగా మారింది. అత్యధిక బియ్యం ఉత్పత్తితో, అత్యధిక నిల్వలతో బియ్యం గిన్నెగా ఉన్న తెలంగాణవైపు రాష్ట్రాలు ఆశగా చూస్తున్నాయి. తమ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సంప్రదించాయి. మరికొన్ని ఇదే బాటలో రానున్నాయి.
మన బియ్యంతో హామీ నెరవేర్చుకొంటున్న కర్ణాటక కాంగ్రెస్!
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తమ రాష్ట్రంలో ‘అన్న భాగ్య’ పథకాన్ని ప్రకటించింది. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు కోసం కర్ణాటక రాష్ట్రం తెలంగాణ సహకారం కోరటం విశేషం. పథకం అమలు చేయాలంటే ప్రతినెల 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని పేర్కొన్నది. తమ దగ్గర సరిపడా నిల్వలు లేవని, తెలంగాణ నుంచి సరఫరా చేయాల్సిందిగా కోరింది. ఏటా 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కోసం సంప్రదింపులు జరుపుతున్నది.
3 లక్షల టన్నుల బియ్యం కోసం తమిళనాడు విజ్ఞప్తి
తమిళనాడు ప్రభుత్వం తమ ప్రజల ఆహార కొరత తీర్చేందుకు సాయం చేయాలని తెలంగాణను కోరింది. 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాలని కోరింది. ఇందులో 2 లక్షల టన్నులు బాయిల్డ్ రైస్ కాగా, మిగతా లక్ష టన్నులు రా రైస్. 2017లోనూ తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ పౌరసరఫరాల శాఖ సహకారంతో రాష్ట్రం నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల బియ్నాన్ని సేకరించింది. కేరళ సైతం తమ ఆహార కొరతను నివారించేందుకు తెలంగాణ సహకారాన్ని కోరింది. తమకూ బాయిల్డ్ రైస్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఎఫ్‌సీఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ బియ్యం
తెలంగాణ నుంచి కొన్ని రాష్ట్రాలు నేరుగా బియ్యం కొనుగోలు చేస్తుండగా.. ఎఫ్‌సీఐ మన రాష్ట్రం నుంచి సేకరించిన బియ్యం ద్వారా అనేక రాష్ట్రాల్లో ప్రజల ఆకలి తీరుతున్నది. కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు తెలంగాణ నుంచే బియ్యం సరఫరా అయ్యాయి. 2014-15లో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్, రా రైస్ కలిపి 24.94 లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలకు సరఫరా కాగా.. 2022-23 నాటికి ఇది ఏకంగా 56.89 లక్షల టన్నులకు పెరిగింది. ఇందులో 40.54 లక్షల టన్నులు బాయిల్డ్ రైస్ కాగా, 11.35 లక్షల టన్నులు రా రైస్. అంటే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బియ్యం ఏకంగా డబుల్ అయ్యింది. దీనిని బట్టే తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.
తొమ్మిదేండ్లలోనే అన్నపూర్ణగా..
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ కరువు కాటకాలకు నిలయం. ధాన్యం ఉత్పత్తి, బియ్యం ఉత్పత్తి చాలా తక్కువ. సన్న బియ్యం అంటే కర్నూలు నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఏ దుకాణానికి వెళ్లినా పొరుగు రాష్ట్రానికి చెందిన బియ్యమే కనిపించేవి. చివరికి రేషన్ దుకాణంలో ఇచ్చే బియ్యం కూడా దిగుమతి చేసుకున్నవే. పంజాబ్ నుంచి ఎక్కువగా వచ్చేవి. అందుకే రేషన్ బియ్యాన్ని ‘పంజాబ్ బియ్యం’ అని కూడా పిలిచేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మట్టిపెల్లలు, రాళ్లు, ఇసుకతో నిండిన ఆ రుచీపచీలేని చప్పిడి బియ్యాన్ని తినలేక ప్రజలు నానా అవస్థలు పడేవారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోయింది. సాగు విస్తీర్ణం తొమ్మిదేండ్లలోనే మూడున్నర రెట్లు, ధాన్యం ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. బియ్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్ర స్థానానికి చేరింది. పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి వ్యవసాయ ప్రధాన పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. 2022-23లో రాష్ట్రంలో 2.66 కోట్ల టన్నుల ధాన్యం, 1.60 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది. తద్వారా దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలంగాణ బియ్యమే కనిపిస్తున్నాయి. రేషన్ దుకాణాల్లోనూ మన బియ్యమే. స్వరాష్ట్రంలో పండిన సన్నబియ్యం అన్నంతో హాస్టల్ విద్యార్థులు కడుపునిండా తింటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతున్నది.
కేంద్రం కుట్రలు చేసినా కేసీఆర్ భరోసా
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిన కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి కండ్లు మండటం మొదలైంది. వరి సాగును అడ్డుకునేలా అనేక కుట్రలు చేసింది. ధాన్యం కొనుగోలు చేయలేం కాబట్టి.. తెలంగాణలో రైతులతో వరి సాగు చేయించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో వరి వేసి అద్భుతంగా పంట తీశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమమంటూ కేంద్రం కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతుల్లో కొంత మనోధైర్యాన్ని దెబ్బతీసింది. కానీ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. కేంద్రం కొనుగోలు చేయకపోయినా పర్వాలేదు, పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా 1.60 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది.