-తొలి నెలలోనే 15 వేల కోట్లు
-పన్నుల రూపంలో 9,698 కోట్లు
-జీఎస్టీ ద్వారా మరో 4,081 కోట్లు
హైదరాబాద్: తెలంగాణకు రాబడి స్టార్ట్ అయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా షురూ అయ్యింది.మొదటి నెలలోనే మంచి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. ఏప్రిల్లో రూ.15,085 కోట్లు రావడం విశేషం. ఇందులో పన్నుల రూపేణా రూ.9,698 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.4,081 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.2,303 కోట్లు సమకూరాయి. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు తెలంగాణ సర్కారు నివేదించింది. తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డుకొంటున్న నరేంద్రమోదీ సర్కారు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నది. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది.
గత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇవ్కుండా వేధించిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నది. 2023-24లో కేంద్రం నుంచి మొత్తం రూ.41,259 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ వస్తుందని వార్షిక బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్లో మోదీ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనూ అదే ధోరణిని ప్రదర్శిస్తున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి సహకరించాల్సిందిపోయి అన్నింట్లో సహాయ నిరాకరణ చేస్తున్నది.
ఏప్రిల్లో ప్రధాన రాబడులు (రూ. కోట్లలో)
జీఎస్టీ 4,081.79
రిజిస్ట్రేషన్లు 990.56
అమ్మకం పన్ను 2,303.10
ఎక్సైజ్ 969.08
కేంద్రం పన్నులు 747.22
ఇతర పన్నులు,
సుంకాలు 606.85
పన్నేతర రాబడి 357.64