Mission Telangana

తెలంగాణ ఆత్మగౌరవ నినాదం చేసిన ఆదిలాబాద్

రాష్ట్ర సాధనే ధ్యేయంగా సీపీఐ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర శనివారం ఆదిలాబాద్‌కు చేరుకుంది. నిర్మల్ మండలం సోన్‌లో ప్రవేశించిన పోరుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ నినాదాలతో సాదర స్వాగతం పలికారు. తెలంగాణ కోసం పోరాడే పార్టీలేవైనా తమకు ఆత్మీయమైనవేనని నిరూపించారు.

పోరుయాత్రకు టీఆర్‌ఎస్‌తోపాటు తెలంగాణ జేఏసీ, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి.యాత్రకు స్వాగతం పలికేందుకు ఆదిలాబాద్ నుంచి టీఆర్‌ఎస్,  సీపీఐ శ్రేణులు వందలాది వాహనాలతో మోటార్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు.

పట్టణంలోని వివిధ ప్రజాసంఘాలు బాజాబజంత్రీలతో ర్యాలీ తీసి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వినిపించారు. అదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సీపీఐ శ్రేణులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టారు. తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మలతో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన ప్రసంగం తెలంగాణవాదులను కట్టిపడేసింది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న దోపిడీని వివరించారు. ప్రజల మనోభావాలను గౌరవించేందుకే తెలంగాణవాదాన్ని సీపీఐ భుజాలకెత్తుకుందని, ఇందులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని సార్థకం చేసుకునేందుకు అవసరమైతే 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినా వెనుకాడబోనని ఆయన అనడంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగసభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సమస్యపై రాష్ట్రంలోని 23 జిల్లాల్లో మాట్లాడేందుకు సిద్ధమేనని ప్రకటించారు. వరంగల్ డిక్లరేషన్‌కు కట్టుబడి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టామని, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దీనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ద్వంద్వ విధానాలతోనే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమవుతోందన్నారు. తెలంగాణకు సీపీఐ కట్టుబడి ఉందని ప్రకటన చేసి ఉద్యమించడం అభినందనీయమన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమించి తెలంగాణను సాధించుకునేందుకు మరో పోరుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. [with inputs from Namasthe Telangana]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *