![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/08/Untitled-Project-26-3.jpg?resize=1024%2C576&ssl=1)
సమైక్య పాలనలో పాలకుల పట్టింపులేమితో కునారిళ్లిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. సరికొత్త పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా, బీసీ, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని ఉదారంగా అందిస్తున్నారు. ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఆధారంగా లోకల్ లీడర్లు, అధికారులు అర్హులను గుర్తించి, వెంటనే లక్షసాయం అందజేస్తున్నారు. ఈ సాయాన్ని దఫదఫాలుగా అందజేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. రాష్ట్రంలోని అన్నిరకాల చేతివృత్తుదారులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ సాయం అందజేస్తూ సీఎం కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అదే కేంద్రంలో ప్రధానమంత్రి ప్రకటించిన పీఎం విశ్వకర్మ పథకంలో సవాలక్ష నిబంధనలు ఉండగా, తెలంగాణ సర్కారు చేతివృత్తులవారు తమకు అవసరమైన పనిముట్లు కొనుక్కొని, వృత్తిని అభివృద్ధి చేసుకొనేందుకు పూర్తి ఉచితంగా లక్ష సాయం అందిస్తూ శభాష్ అనిపించుకొంటున్నది.
పీఎం విశ్వకర్మ యోజనలో సవాలక్ష* నిబంధనలు
దేశంలో అత్యధికంగా ఉన్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బోట్‌మేకర్, పనిముట్ల తయారీదారు (ఆర్మరర్), హ్యామర్ అండ్ టూల్‌కిట్ మేకర్, లాక్సిత్, శిల్పి, స్టోన్ బ్రేకర్, చర్మకారులు, తాపీమేస్త్రీ, బుట్టలు/చాపలు/పొరకల తయారీ, బొమ్మల తయారీ, బార్బర్, పూలదండల తయారీ, ధోబీ, టైలర్, చేప వలలు తయారీదారులు లాంటి 18 రకాల హస్తకళలు, చేతి వృత్తుల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. చేతివృత్తులను తాము ఆదుకొనేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ఊదరగొట్టారు. కానీ,, కొద్దిరోజులకే పథకంలోని లోపాలు బయటపడ్డాయి. ఇందులో చాలారకాల చేతివృత్తులు.. ముఖ్యంగా భారత ఆత్మ, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన హస్తకళలను ఇందులో చేర్చలేదు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే గిరిజనులు నిర్వహించే హస్తకళలూ ఈ పథకంలోకి రాలేదు. అలాగే, ఇచ్చే లక్ష రుణం కూడా 18 నెలల్లో తిరిగి చెల్లించాలని కండిషన్ పెట్టారు. దీంతో ఈ పథకంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. లక్ష సాయం చేసినట్టే చేసి, తిరిగి చెల్లించాలని చెప్పడంతో చేతివృత్తిదారులు మోదీ సర్కారుపై మండిపడుతున్నారు.