mt_logo

మోండాలో మోడల్‌ మార్కెట్‌..న‌గ‌ర‌వాసుల‌కు ఒకేచోట నిత్యావ‌స‌రాలు

  • ఒకేచోట కూర‌గాయ‌లు, మాంసాహారం, చేప‌లు
  • రూ.2.80 కోట్ల పనులకు బల్దియా టెండర్‌
  • కూకట్‌పల్లి, నాచారం, బేగంబజార్‌లో అందుబాటులోకి
  • వచ్చే నెలలో మల్లాపూర్‌ చేపల మార్కెట్‌ ప్రారంభం

న‌గ‌ర‌జీవ‌నం అంటేనే అస్త‌వ్య‌స్తం.. కూర‌గాయ‌లు ఓ చోట ఉంటే..మాంసాహారం మ‌రోచోట‌.. చేప‌లు ఇంకో చోట‌.. ఒకేసారి అన్ని కావాలంటే ఆ రోజులో పావువంతు వెచ్చించాల్సిందే. ఇవ‌న్నీ తీసుకొని ఇంటికి చేరేసరికి మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యం దాటిపోతుంది. ఈ ఇక్క‌ట్ల‌ను గ‌మ‌నించిన తెలంగాణ స‌ర్కారు న‌గ‌ర‌వాసులకు నిత్యావ‌స‌రాల‌న్నీ ఒకేచోట ల‌భించేలా ప్ర‌ణాళిక రూపొందించింది. మోడ‌ల్ మార్కెట్ల ఏర్పాటుకు సంక‌ల్పించింది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా మార్కెట్లు కూక‌ట్‌ప‌ల్లి, నాచారం, బేగంబ‌జార్‌లో అందుబాటులోకి రాగా, వ‌చ్చే నెల‌లో మ‌ల్లాపూర్ చేప‌ల మార్కెట్ ప్రారంభానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. న‌గ‌ర‌వాసుల కోసం మోండాలో మోడ‌ల్ మార్కెట్ కూడా రూపుదిద్దుకోనున్న‌ది. ఇందుకోసం టెండర్ల‌ను కూడా ఆహ్వానించారు.

ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో కనీస అవసరాలైన కూరగాయలు, మాంసాహారం, చేపలు నాణ్యమైనవి ఒకే చోట దొరికేలా అన్ని వసతులతో కూడిన మోడల్‌ మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ప్రధానంగా రహదారుల వెంట, అపరిశుభ్ర వాతావరణంలో చేపల విక్రయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించిన అధికారులు ప్రత్యేకంగా చేపల మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే రూ. 20.01 కోట్లతో ఐదు చోట్ల చేపల మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూ.14.62కోట్లతో నాచారం, కూకట్‌పల్లి , బేగంబజార్‌లో ఫిష్‌ మారెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

అయితే పురోగతిలో ఉన్న మల్లాపూర్‌లో రూ. 2.58 కోట్లతో చేపడుతున్న పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది. తాజాగా మోండా మార్కెట్‌లో రూ. 2.80 కోట్లతో ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. కాగా మోడల్‌ మార్కెట్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, శుభ్రమైన మాంసాహారం, చేపలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పడింది. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత ప్రదేశాలను గుర్తించి ఈ మోడల్‌ మారెట్ల నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించి చర్యలు చేపడుతున్నది.