తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో జరిగింది. పది మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, జీ జగదీశ్ రెడ్డి లకు రెండోసారి కూడా మంత్రులుగా అవకాశం కల్పించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలకు కొత్తగా మంత్రిపదవులు దక్కాయి. ఇదిలావుండగా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఇచ్చే ఆదేశాల మేరకు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించేదీ వెల్లడిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది.