హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారక భవనంలోకి ప్రవేశించిన సీఎంకి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు.
కార్యక్రమం ఆసాంతం ఎంతో భావోద్వేగంగా కొనసాగింది. అమరుల స్మరణ తో సభ మొత్తం సంతాప వాతావరణం అలుముకున్నది. తెలంగాణ సాధన పోరాటంలో పాల్గొన్న ఎంతో మంది ప్రముఖులు తెలంగాణ బిడ్డలు పలు రంగాలకు చెందిన కళాకారులు కవులు మేధావులు జర్నలిస్టులు సభకు హాజరయ్యారు. వారు ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు స్మరించుకుంటూ నాటి అమరుల త్యాగాలను యాది చేసుకుంటూ.. జై తెలంగాణ ‘అమరులకు జోహార్’ కొనసాగిస్తాం అమరుల ఆశయాలను’ జై కేసీఆర్’ అనే నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఒకవైపు సచివాలయం అటువైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు సంతోషాన్ని నింపగా.. అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే సందర్భంలో ఉన్నామని, తెలంగాణ కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని, పదేళ్లకు చేరుకున్న తెలంగాణ అభివృద్ధిలో వారి త్యాగాల స్ఫూర్తి ప్రతిబింబిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.