mt_logo

త్యాగధనులైన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్య నివాళి 

  • రూ. 177.50 కోట్లతో ఆరు అంతస్తుల్లో అమరవీరుల జ్యోతి 
  • లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు ( జూన్ 22) సందర్భంగా… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం సాయంత్రం జరగనున్నది. ఈ సందర్భంగా  హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.  రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన ప్రతి రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది.

తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అమరుల స్మారకం.. అమర దీపం’ వెలిగించనున్నారు. తద్వారా త్యాగధనులైన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్య నివాళి అర్పించనున్నది. 

అమరుల స్మారక భవన నిర్మాణ వివరాలు:

 తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా రూ. 177.50 కోట్లతో ఆరు అంతస్తుల్లో ప్రభుత్వం అమరవీరుల జ్యోతిని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందు కోసం కేటాయించింది. ఈ స్థలంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. 54, 37 అక్షరాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ప్రమిదను రూపొందించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు, మరో వైపు 18 మీటర్ల ఎత్తుతో, మొత్తంగా గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది.  స్మారక భవనం నిర్మాణానికి మొత్తంగా 1600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్ ను వినియోగించారు. 

అంతస్తుల వారీగా వివరాలు:

బేస్ మెంట్ 1 : దీని విస్తీర్ణం 1,06,993 చదరపు అడుగులు. 160 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం వుంది. లాంజ్ ఏరియా, లిఫ్ట్ లాబీ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బందికి టాయిలెట్, ప్యానెల్ రూమ్, పంప్ రూమ్..ఏర్పాటు చేశారు.

బేస్ మెంట్ 2 : ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితమైంది.  175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యం. లాంజ్ ఏరియా, లిఫ్ట్ లాబీ, భూగర్భంలో 3 లక్షల లీటర్ల నీటి సామర్థ్యమున్న సంప్( నీటి గుంట)లను ఏర్పాటు చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్ :   దీని విస్తీర్ణం 28,707 చదరపు అడుగులు. ఇందులో మెయింటెనెన్స్, సివిల్,  ఎలక్ట్రికల్ కార్యకలాపాలు, కాపలాదారు గది, చిల్లర్ రూమ్ (ఎయిర్ కండీషన్ నిమిత్తం),  వర్క్ షాప్ ఏరియా, స్టోర్ రూమ్ లు, కోల్డ్ స్టోరేజ్, డ్రై స్టోరేజ్ లతో   కిచెన్  ఏరియా, సావనీర్ గది తదితరాలు ఉంటాయి.

మొదటి అంతస్తు: దీని విస్తీర్ణం 10,656 చదరపు అడుగులు. ఇందులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో విజువల్ రూమ్,టాయిలెట్లు,   ఎస్కలేటర్లు ఉంటాయి. 

రెండవ అంతస్తు : దీని విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు. కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా, టాయిలెట్లు ఉన్నాయి

మూడవ అంతస్తు(టెర్రస్): దీని విస్తీర్ణం 8095 చదరపు అడుగులు. కూర్చునే ప్రదేశం,  ప్యాంటీ ఏరియా తో కూడిన రెస్టారెంట్, టాయిలెట్లు, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్..వున్నాయి 

మెజ్జనైన్ ఫ్లోర్  :  దీని విస్తీర్ణం 5900 చదరపు అడుగులు. గ్లాస్ రూఫ్ తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంకు  

అమర దీపం  :    తక్కువ కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్ తో తయారైన 26 మీటర్ల జ్వాల. ఇది  గోల్డెన్ ఎల్లో కలర్ లో ప్రకాశిస్తుంది. 

ఎలక్ట్రో మెకానికల్ (ఆరో అంతస్తు) :  

• గ్రౌండ్ ఫ్లోర్ లో 10,000 సి ఎఫ్ఎం గల ఎయిర్ కూలింగ్ ఏర్పాటు

• 1వ నుండి 4వ అంతస్తు వరకు 300 టన్నుల సామర్థ్యం గల డైకిన్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ 

• సెల్లార్ లో తాజా గాలి ప్రసారానిచ్చే ఎగ్జాస్ట్ తో మెకానికల్ వెంటిలేషన్ 

• 500 కె వి పూర్తి బ్యాకప్ జనరేటర్.

• 50 కె ఎల్ డి సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటు

• 15 మంది ఉపయోగించుకునే సామర్థ్యంతో బేస్మెంట్-2 నుంచి 4వ అంతస్తు వరకు 3 లిఫ్టుల సదుపాయం

• 170 అంగుళాల తో కూడిన ఆడియో విజువల్ రూమ్

• సెక్యూరిటీ కెమెరాలు….తదితర నిర్మాణాలున్నాయి.