mt_logo

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

భ్య్: ఎన్. వేణు గోపాల్

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరిత్రాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు అన్నిరకాల కుటిల ప్రయత్నాలూ సాగిస్తున్నాయి. అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవరోధాలు ఒక్క పాలకపక్షం నుంచి మాత్రమే కాదు, పాలకవర్గ భావజాలాన్ని తెలిసో తెలియకో నింపుకున్న అన్ని రాజకీయపక్షాలూ, అధికారవర్గమూ, బుద్ధిజీవులూ కూడ ఆ దారిలోనే ఉన్నారు. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల మీదుగా సోనియాగాంధీ దాకా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కనీసం ఏడు దశాబ్దాలుగా ద్రోహం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ఈ ప్రయత్నాలలో మొదటి ముద్దాయి. సాగరహారం ఒక చరిత్రాత్మకమైన ప్రజాగ్రహ ప్రదర్శన అని తెలిసి కూడ దాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించలేకపోతున్న ఇతర రాజకీయ పక్షాలూ సహ ముద్దాయిలే. తమ అధికారిక విధినిషేధాలను, సర్వీస్ నిబంధనలను, కోడ్ ఆఫ్ కాండక్ట్ నూ ఉల్లంఘించి, అధిగమించి అవాంఛనీయమైన రాజకీయ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వాధికారులు, ప్రత్యేకించి పోలీసు అధికారులు కీలకమైన సహ ముద్దాయిలు. ఈ సాగరహార వ్యతిరేకులు ఒకటి కాకపోతే ఒకటి పనికొస్తుందన్నట్టుగా ఎన్నెన్నో పచ్చి అబద్ధాలనూ, నిజాల్లా కనబడే అబద్ధాలనూ, సాకులనూ ముందుకు తెచ్చి అవే తిరుగులేని వాదనలన్నట్టుగా భ్రమపడుతున్నారు. తమకు కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల పట్ల ఉన్న దురభిమానం మీద, తమలో రంగరించుకున్న పాలకవర్గ భావజాలం మీద, తెలంగాణ ప్రజల పట్ల తమ నరనరానా జీర్ణించుకున్న వ్యతిరేకత మీద ఈ వాదనల మేలి ముసుగులు కప్పుతున్నారు.సాగరహారం వల్ల హింస జరుగుతుందట. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రముఖుల ఇళ్ల మీద దాడులు, ఆస్తుల ధ్వంసం జరుగుతుందట. మిలియన్ మార్చ్ లో ఏమయిందో చూశారు గదా అని పోలీసు అధికారులు గొప్ప ఉదాహరణ చూపినట్టు నటిస్తున్నారు. న్యాయాన్యాయాల ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి హింసాహింసల చర్చను ముందుకు తేవడం ఈ దేశంలో పాలకవర్గాలు వందల ఏళ్లుగా కళగా అభివృద్ధి చేసిన విద్య. ఇప్పుడు సాగరహారం మీద కూడ అదే వాదన ముందుకు తెస్తున్నారు.

ఈ వలలో పడి తెలంగాణవాదులు కూడ తాము హింసావాదులం కామని, హింస చేయబోమని, ఎన్నటికీ తెగని హింసాహింసల చర్చలో మునగబోతున్నారు. ఇక్కడ సమస్య హింసాహింసలది కాదు. అది చర్చనీయాంశం కాదు. అసలు ప్రస్తుత సమస్య న్యాయాన్యాయాలది. సాగరహారం చేస్తున్నది న్యాయాన్వేషణా ప్రయత్నం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ మీద నిర్విరామంగా సాగిన హింసనూ, దౌర్జన్యాన్నీ, అన్యాయాన్నీ ఆపే ప్రయత్నం. అక్కడ హింస జరుగుతుందా లేదా అనేది అసలు ప్రశ్నే కాదు. న్యాయం సాధించడానికి, అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఏ మార్గం చేపట్టవలసి వచ్చినా సరే. అయినా, ఎప్పుడైనా ఒక ప్రజా ఉద్యమంలో ఏమి జరుగుతుందనేది ఒక్క పక్షమే నిర్ణయించ దు. అవతలి పక్షం ఏమి చేస్తుందనే దాన్ని బట్టి, ఆ చర్యను బట్టి ప్రతిచర్య ఉం టుంది. కనుక ఇప్పుడు ఇటు నుంచి హింస జరుగుతుందేమో అని ఎవరైనా అనుమానిస్తే, వాదన కోసం చెప్పాలంటే, ఎక్కువలో ఎక్కువ అది ఆరు దశాబ్దాల హింసకు ప్రతిహింస మాత్రమే అవుతుంది. తెలంగాణ తనంతట తాను ఎటువంటి హింసకు పూనుకోదు. కాని ఆరు దశాబ్దాలుగా తన మీద హింస జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ అహింసావాదులు, న్యాయవాదులు ఏమయిపోయారు అని మాత్రం అడగవలసి ఉంది. నిజానికి ఆ ఆరు దశాబ్దాల హింసకు ప్రతిహింస జరిపే నైతిక హక్కు తెలంగాణకు ఉంది. అయినా తెలంగాణ అందుకు కూడ పూనుకోబోవడం లేదు. న్యాయం మాత్రమే అడుగుతోంది.. న్యాయం జరిగితే హింసకూ, ప్రతిహింసకూ అవకాశమే ఉండ దు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, అవతలిపక్షం లిఖితపూర్వకంగా వాగ్దానం చేసిన హక్కులు మాత్రమే అడుగుతోంది. ఆ హక్కులు అమలయితే హింసకు తావే ఉండదు.

సాగరహారం వల్ల హైదరాబాద్ ముద్ర బాండ్ హైదరాబాద్) చెరిగిపోతుందని మరొక వాదన. ఇంతకూ ఎవరిదీ హైదరాబాద్ ముద్ర? ఎవరి కోసం ఈ హైదరాబాద్ ముద్ర? హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజల నెత్తుటితో, చెమటతో తడిసిన వేలాది ఎకరాల సర్ఫ్ ఎ ఖాస్ భూములను, వందలాది నిజాం భవనాలను తెలంగాణేతరులు అప్పనంగా ఆక్రమించుకుని కూచోవడమే, తెలంగాణ బిడ్డల నోట మట్టి కొట్టడమే బ్రాండ్ హైదరాబాద్ అయితే అది లేకపోయి నా ఫరవాలేదు. వందల ఎకరాల భూములు ఎరవేసి, కారుచౌక శ్రమ భ్రమపెట్టి దేశదేశాల సంపన్నుల నుంచి, బహుళజాతి సంస్థల నుంచి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టి, ఆ నిధులన్నీ నొక్కేయడమే ఆ ముద్ర అయితే ఆ ముద్ర లేకపోతేనే మంచిది. బ్రాండ్ హైదరాబాద్ వల్ల తెలంగాణ భూమి పుత్రులకు ఏమి ఒరిగిందని, ఏమి దక్కిందని ఆ బ్రాండ్ ను గౌరవించాలి?

అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సుకు హాజరయ్యే దేశదేశాల ప్రతినిధుల ముందు ఆంధ్రవూపదేశ్‌కు తలవంపులు తేవద్దట. ఈ ఆంధ్రప్రదేశ్ రెండు తరాలుగా ఎన్ని కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు తలవంపులు తేవడం మాత్రమే కాదు, తలలు నరికివేసింది! పశువులూ మొక్కలూ జీవవైవిధ్య పరిరక్షణ గురించి మాట్లాడడం సరే. సరిగ్గా ఆ చర్చలు జరిగే నేల మీద యాభై ఆరు సంవత్సరాలుగా ఎన్ని వనరులు, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని నిధులు, ఎన్ని జీవితాలు కొల్లగొట్టబడి భూమిపువూతులకు రక్షణ కరవైంది! వాళ్ల పరిరక్షణ గురించి ఎవరు మాట్లాడాలి? ప్రాణికోటి పరిరక్షణ చర్చలలో తెలంగాణ ప్రాణా లు లెక్కకు రావా?ఇంక అన్నిటికన్న దుర్మార్గమైన, దురుద్దేశపూరితమైన, కుట్ర పూరితమైన వాదన మతకల్లోలాలు జరుగుతాయనే సూచన. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీక. హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలన్నీ హంతక రాజకీయ ముఠా తగాదాలే తప్ప ఇరు మతాల ప్రజల మధ్య ఘర్షణలు కా వు. ప్రతి సందర్బంలోనూ ఏదో ఒక రాజకీయ దుష్ర్పయోజనాన్ని తీర్చడానికే మతాల మధ్య చిచ్చు రగిలించడం జరిగింది. ఇప్పుడు కూడా పాలకులు ఆ కుట్రకు సిద్ధపడుతున్నారని ఈ పోలీసు వాదన సూచిస్తున్నదా? ఇప్పటికైనా పాలకవర్గాలు, అధికారవర్గాలు, తాన తందాన మేధావులు తమ పనికిమాలిన వాదనలు కట్టిపెట్టి తెలంగాణ న్యాయాన్వేషణకు, సాగరహారానికి అడ్డు పడకుండా ఉండాలి. తెలంగాణ ప్రజలు నలభై సంవత్సరాలుగా ప్రకటిస్తున్న ఆకాంక్షను, అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నికల వాగ్దానంగా ఆమోదించిన ఆకాంక్షను మళ్లీ ఒకసారి శాంతియుతంగా ప్రకటించనివ్వాలి. ఆ ఆకాంక్షను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కూడ సమ్మతించిందని, ఆ తర్వాత మాట మార్చినందు వల్లనే ఇవాళ్టి ప్రజాగ్రహ వ్యక్తీకరణ జరుగుతున్నదని గుర్తించాలి.

సాగరహారం తెలంగాణ బిడ్డలు తమ తల్లికి ఎత్తిపడుతున్న హారతి. సాగరహారం తెలంగాణ తల్లి సిగలో మెరవనున్న నాగరం. హుస్సేన్ సాగరానికి ముళ్లకంచెలు కట్టగలరేమో, లాఠీలు ఝళిపింపగలరేమో, కాల్పులు కూడా జరపగలరేమో.. కానీ తెలంగాణ ప్రజాహృదయాన్ని చిదిమేయలేరు. ఆ గుండె నెత్తురులో రవరవలాడుతున్న నిత్య చలనశీల ఆకాంక్షను నలిపి వేయలేరు. అది నెత్తుటిచుక్క మాత్రమే కాదు. దావానలమవుతుంది.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *