దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్నది ఎవరో తెలుసా? తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే టాప్‌లో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? దేశానికి గరిష్ఠంగా ఆదాయం ఇస్తున్న రాష్ట్రం ఏదో తెలుసా? అనతికాలంలోనే ఎన్ఎస్‌డీపీలో అగ్రస్థానానికి ఎగబాకిన రాష్ట్రం పేరు తెలుసా? వీటన్నింటికీ ఒక్కటే సమాధానం.. అది తెలంగాణ.. ఇది ఏ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులో.. తెలంగాణ సర్కారో చెప్తున్న ముచ్చట కాదు..కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు చెప్తున్న నిజం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ ప్రగతి పరుగులు పెడుతున్న తెలంగాణ ఇప్పుడు మరో ఘనతను సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (ఎన్‌ఎస్‌డీపీ) లో
బీజేపీ, కాంగ్రెస్‌పాలిత పెద్ద పెద్ద డబుల్ ఇంజిన్ రాష్ట్రాలను కూడా పక్కకునెట్టి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ, పథకాల అమలు శాఖ స్పష్టం చేసింది.
రూ.3,08,732 ఎన్ఎస్‌డీపీతో తెలంగాణ టాప్
రాష్ట్రంలో ఏడాదిలో పౌరుడి ఉత్పాదకత సాధనను ఎన్ఎస్‌డీపీ అని పిలుస్తారు. అంటే ఏడాదిలో పౌరుడి సంపాదనే పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్. కేంద్ర సర్కారు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2022-23లో ప్రస్తుత ధరల్లో తెలంగాణ ఎన్‌ఎస్‌డీపీ రూ.3,08,732గా ఉన్నది. తలసరి ఆదాయంలోనూ ఇప్పటికే అగ్రభాగంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు డబుల్ ఇంజిన్ రాష్ట్రాలను దాటేసి ఎన్ఎస్‌డీపీలోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. కేవలం తొమ్మిదేండ్లలోనే రాష్ట్ర ఎన్ఎస్‌డీపీలో 150 శాతం వృద్ధి సాధించి, ఔరా అనిపించింది. దేశ జీడీపీకి తెలంగాణ రాష్ట్రమే ప్రధాన మద్దతుదారుగా నిలిచింది. తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రత్యేక పాలసీలతోనే ఇది సాధ్యమైంది.
తెలంగాణ ఎన్‌ఎస్‌డీపీ
2014-15 1,24,104
2017-18 1,79,358
2022-23 3,08,732