తెలంగాణలోని నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ఆరోగ్య శ్రీతో భరోసా కల్పిస్తున్నది. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ రూ.2 లక్షల వరకూ ఉచిత బీమా అందజేస్తున్నది. నెట్‌వర్క్ దవాఖానల్లో గుండె, కిడ్నీ, కాలేయ సంబంధ అనేకరకాల అనారోగ్య సమస్యలకు పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నది. ఏడాదిన్నర క్రితమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌లోనూ చేరింది. అప్పటినుంచీ ఈ పథకం ‘ఆయుష్మాన్ భారత్-ఆరోగ్యశ్రీ’గా అమలవుతున్నది. అయితే, తెలంగాణలోని ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలంగాణ సర్కారు ఆయుష్మాన్ భారత్ అమలుచేయడం లేదని, ఈ పథకం అమలుచేస్తే చాలామందికి మేలు జరుగుతుందంటూ ఊదరగొడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న, ఆరోగ్యాలకు భరోసాగా నిలుస్తున్న ఆరోగ్య శ్రీ పథకంపై బురద జల్లుతున్నారు. కాగా, ఇలాంటి వాళ్లకు కేంద్రంలోని ఆ పార్టీ సర్కారే సమాధానం ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీనే ఉత్తమమని మోదీ సర్కారు ఒప్పుకొన్నది. అలాగే, ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా కల్పిస్తున్న దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ టాప్‌లో నిలిచిందని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది.
ఆరోగ్య శ్రీ గురించి కేంద్రం ఏం చెప్పిందంటే?
-తెలంగాణలో కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ వల్లే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు.
-ఆయుష్మాన్ కింద 29,02,621 కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా అమలవుతుంటే..61,07,379 కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.
-అంటే తెలంగాణలో 68శాతం మందికి ఆరోగ్య శ్రీ అమలు అవుతుండగా, కేవలం 32 శాతం కుటుంబాలకే ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నది.
-వ్యాధుల సంఖ్య, కుటుంబాల కవరేజీ విషయంలోనూ ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీనే బెటర్.