- వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ
- అవసరమైన మందులు అందుబాటులో..
- అందుబాటులో 108 అంబులెన్స్ లు
పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు..వీసీ లో హెల్త్ సెక్రటరీ రిజ్వి, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి హరీశ్ రావు వివరించారు.
వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ
పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ముందస్తుగా అప్రమత్తమై ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందన్నారు. మార్చి మొదటి వారంలో సమీక్ష నిర్వహించి, జిల్లాకు ఇద్దరు చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. వీరి ద్వారా సబ్ సెంటర్, పీహెచ్సీ సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు.
అవసరమైన మందులు అందుబాటులో..
పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధం చేసినట్లు చెప్పారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, పీహెచ్సీ, యూ పీహెచ్సీ, సహా అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం సహా, అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చూడటం జరిగిందన్నారు. వడ దెబ్బ తగిలిన పెద్దలు, చిన్నారులకు చికిత్స అందించేలా సంసిద్ధం చేసినట్లు చెప్పారు.
108 అంబులెన్స్ అందుబాటులో..
ప్రత్యేకంగా వార్డులు, ఐసీయూ బెడ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.108 అంబులెన్స్ అందుబాటులో ఉంచి, తక్షణమే వైద్య సహాయం అందేలా అంబులెన్స్ లో అవసరమైన మందులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఐవి ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ సకాలంలో అప్రమత్తం చేయడం వల్ల అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మరింత వేగవంతం అవుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు సూచించారు.