తెలంగాణలోని మెడికల్ డివైజెస్ పార్క్ లో 530 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ స్టెంట్ల పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్(ఎస్‌ఎంటీ) స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.250 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంజీవని పేరిట ఎస్‌ఎంటీ ఈ ఉత్పాదక కేంద్రాన్ని తీసుకురాగా.. మొత్తం రూ.530 కోట్లతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రావడం సంతోషంగా ఉందన్నారు. ఎస్‌ఎంటీ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్లు, బెలూన్ల ఉత్పత్తి పరిశ్రమని తెలిపారు. ఇక 70 దేశాలకు హైదరాబాద్ కేంద్రంగా స్టెంట్లు, బెలూన్ల ఎగుమతి జరుగనుందన్నారు. కరోనాతో ప్రపంచం స్తంభించిపోయినా ఎస్‌ఎంటీ మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. కేవలం మూడేండ్లలోనే ఇంతపెద్ద ప్లాంట్‌ను స్థాపించడం.. ఆ సంస్థ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. వైద్య ఉపకరణాల తయారీ, పరిశోధనల నేపథ్యంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. ఎస్‌ఎంటీ స్టెంట్లు, బెలూన్ల ఉత్పత్తి పరిశ్రమతో సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ యువతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ ప్రతినిధులకు ముందే చెప్పామని గుర్తుచేశారు. ఒక పరిశ్రమ స్థాపించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎస్‌ఎంటీ ద్వారా ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్ బెలూన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. వృద్ధుల కోసం, టీఏవీఐ, గుండెలో రంధ్రం ఉన్న పిల్లల కోసం ఆక్టూడర్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేస్తారన్నారు. గుండె వ్యాధులతో బాధపడేవారికి వేసే స్టెంట్లు ఇప్పటివరకూ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయని, ఇకపై మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. దీనివల్ల పేదలకు వైద్యం తక్కువ ధరకే దొరుకుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే జీ మహిపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ జీ బాలమల్లు, వీసీ అండ్ ఎండీ నర్సింహారెడ్డి, డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.