mt_logo

మ‌హిళా ఆరోగ్యానికి తెలంగాణ స‌ర్కారు ర‌క్ష‌.. అతివ‌ల వైద్యం కోసం ఆరోగ్య మ‌హిళ కేంద్రాల పెంపు!

తెలంగాణ స‌ర్కారు వైద్య‌రంగంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా మొత్తం కుటుంబానికే ఆయువుప‌ట్టైన‌ మ‌హిళా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న‌ది. బాలింత‌లు, గ‌ర్భిణుల‌కు అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూనే.. గ‌ర్భందాల్చిన‌నాటినుంచి బిడ్డ పుట్టి ఎదిగేవ‌ర‌కూ స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందిస్తున్న‌ది. ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లోనే ఉచితంగా ప్ర‌స‌వం నిర్వ‌హించి, వారికి ఎలాంటి ఆర్థిక‌భారం లేకుండా కేసీఆర్ కిట్‌తోపాటు మ‌గ‌బిడ్డ పుడితే రూ. 12వేలు, ఆడ‌బిడ్డ పుడితే రూ.13 వేలు అంద‌జేస్తున్న‌ది. స‌ర్కారు వాహ‌నంలోనే త‌ల్లీబిడ్డ‌ను క్షేమంగా ఇంటివ‌ద్ద దిగ‌బెడుతున్న‌ది. అలాగే, బాలింత‌కు, బిడ్డ‌కు పౌష్టికాహారాన్ని అందించి, వారు ఆరోగ్యంగా ఉండేలా కంటికిరెప్ప‌లా కాచుకొంటున్న‌ది. వీరితోపాటు సాధార‌ణ మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఆరోగ్య మ‌హిళ‌ అనే వినూత్న కార్య‌క్ర‌మాన్ని 2023 మార్చి 8న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టీ హరీశ్‌రావు కరీంనగర్‌ల‌ని అర్బన్ హెల్త్ సెంట‌ర్‌లో ప్రారంభించారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభించి, అనంత‌రం 272 కేంద్రాల‌కు విస్త‌రించారు. ఇప్పుడు ఈ సంఖ్య‌ను మ‌రింత పెంచి, ప్ర‌తి మ‌హిళ ఆరోగ్యానికి తెలంగాణ స‌ర్కారు ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్న‌ది. 

మ‌రో 100 ఆరోగ్య మ‌హిళా కేంద్రాలుఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 272 ఆరోగ్య మ‌హిళా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మ‌హిళ‌ల‌కు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్,  థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలులాంటి అతి ముఖ్య‌మైన  ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా నిర్వ‌హిస్తున్నారు. రోగనిర్ధార‌ణ జ‌రిగితే చికిత్స అందించి, ఉచితంగా మందులు అంద‌జేస్తున్నారు. శ‌స్త్రచికిత్స అవ‌స‌ర‌మైతే పెద్ద ద‌వాఖాన‌ల‌కు రెఫ‌ర్ చేస్తున్నారు. మ‌హిళ‌ల‌నుంచి ఈ కేంద్రాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఉచితంగా ప‌రీక్ష‌లు చేసి, మందులు అంద‌జేస్తుండ‌డంతో అతివ‌లు క్యూక‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు ఆరోగ్య మ‌హిళ‌ కేంద్రాల సంఖ్య‌ను మ‌రో 100 పెంచింది. దీంతో వాటి సంఖ్య 372కు చేరుకున్న‌ది. కొత్త‌గా మంజూరు చేసిన కేంద్రాల‌ను ఈ నెల 12న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు. కొత్త కేంద్రాల‌తో మ‌రింత‌మంది మ‌హిళ‌ల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌ల‌తోపాటు మెరుగైన వైద్యం అంద‌నున్న‌ది.