
తెలంగాణ అంటేనే రైతు సంక్షేమం.. అన్నదాతకు అందలం. సమైక్య పాలన చెరవీడి స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. దేశానికే అన్నంపెట్టే అన్నదాతను కష్టాల కడలి దాటించేందుకు సంకల్పం బూనారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాములు కట్టారు. అనంతరం మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ విద్యుత్తు యజ్ఞమే చేశారు. రైతు బంధుతో రైతుల పెట్టుబడి కష్టాలు తీర్చారు. రైతు బీమాను తీసుకొచ్చి.. అన్నదాత ఏవిధంగా మరణించినా ఆ కుటంబం రోడ్డున పడకుండా కాపాడారు. రైతు రుణమాఫీతో అన్నదాత అప్పుల గోసనూ తీర్చారు. ఈ చర్యలతో అనతికాలంలోనే తెలంగాణ మొత్తం పచ్చబడింది. పసిడి పంటలకు నెలవుగా మారింది. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌నే దాటేసింది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించింది.
రుణమాఫీ చకచకా..
ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీని చకచకా చేసేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన తెలంగాణ సర్కారు ఈ మేరకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. బ్యాంకు నుంచి సమస్యలు ఎదురైనా ఒక్కొక్కటీ సావధానంగా పరిష్కరిస్తూ రుణమాఫీకి అడ్డంకులు లేకుండా చేస్తున్నది. ప్రతి రైతుకూ రుణమాఫీ జరిగి, అన్నదాత అప్పుల బాధ తీరేలా చూస్తున్నది. ఇందులో భాగంగానే 21.35 లక్షల మంది రైతుల రూ.11,812 కోట్ల రుణాలను తెలంగాణ సర్కారు మాఫీ చేసి, రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకొన్నది. ఈ మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమచేసిన కేసీఆర్ సర్కార్.. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల సర్కార్ అని నిరూపించింది. రుణమాఫీ కోసం బుధవారం (సెప్టెంబర్ 20) రూ. వెయ్యి కోట్లను విడుదల చేసింది. దీంతో రుణమాఫీ మరింత వేగం పుంజుకొన్నది. రెండో విడత రుణమాఫీని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది.
రుణమాఫీ వివరాలు
–29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-ఆగస్టు 15న ఒకే రోజు రూ.5809 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
–9 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
-ఇప్పటి వరకూ 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణన్నీ మాఫీ చేసింది.
-రాబోయే రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేయనున్నది.