ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకనుండి స్టాఫ్‌నర్స్‌ని నర్సింగ్ ఆఫీసర్‌గా,హెడ్ నర్స్‌ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 ను, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్‌ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చడం జరిగింది.
వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. పబ్లిక్ హెల్త్ సైడ్ ఆసుపత్రుల్లో పని చేసే పబ్లిక్ హెల్త్‌నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టును యధాతధంగా ఉంచటం జరిగింది.
మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మీ గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.