- రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే
- సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేసారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’’ అనే నినాదంతో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగింది. పదేళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచింది. 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగిందన్నారు. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట నిలిచింది తెలంగాణ, ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి.
తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ తరిభూములైనాయి. మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యథలకు చరమగీతం పాడింది అన్నారు. వృత్తి పనులవారికి ఆర్ధిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయి, పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయన్నారు. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తున్నదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.