- ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్’ విజయవంతం
- నీట్‌లో గురుకుల విద్యార్థుల హవా
- మొత్తం 275 మందికి మెడికల్ సీట్లు

పట్టించుకొనే పాలకులు లేక.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో 60 ఏండ్లుగా తెలంగాణలోని నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డలు..ఆశలు చంపుకొని వివిధ పనులకు మళ్లారు. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పెద్ద సంఖ్యలో గురుకులాలు వెలిశాయి. వసతి, సన్నబియ్యంతో మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనందించడంతో మన బిడ్డలు జాతీయస్థాయిల పరీక్షల్లోనూ మెరుస్తున్నారు. ఇందుకు తాజాగా విడుదలైన నీట్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్’ ప్రాజెక్టు విజయవంతంగా దూసుకుపోతుండటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా 275 మంది సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన బిడ్డలు సైతం చరిత్రలోనే తొలిసారిగా నీట్‌లో అత్యత్తమ ర్యాంకులను సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటారు.
ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న తెలంగాణ బిడ్డలు
తెలంగాణ సర్కారు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు ఆపరేషన్ ఎమరాల్డ్ (ఓపీఎం) పేరిట ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. ఈ ఏడాది ఓపీబీసీ కింద 223 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా.. వారిలో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్ గురుకులాలకు చెందిన మరో 50 మంది ర్యాంకులు కైవసం చేసుకోవడంతో ఈసారి సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే 203 మంది ర్యాంకులు సాధించినట్టయింది. ఆపరేషన్ ఎమరాల్డ్ కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇవ్వగా.. వారిలో 64 మంది ర్యాంకులు సాధించారు. వీరితోపాటు రెగ్యులర్ గురుకులాకు చెందిన మరో 8 మంది ర్యాంకులు పొందడంతో గిరిజన గురుకులాల నుంచి మొత్తం 72 మంది విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నట్టయింది. దీంతో ఓపీబీసీ, ఓపీఎం కింద శిక్షణ పొందిన వారిలో మొత్తంగా 69 శాతం మంది విద్యార్థులు ర్యాంకులు లభించాయి.
గిరిజన బిడ్డ.. ఆలిండియా 90వ ర్యాంకుతో సత్తా
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని గుగులోత్ సంధ్య ఆలిండియా స్థాయిలో 90వ ర్యాంకును కైవసం చేసుకున్నది. ఇది చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. అలాగే, జయపాల్ రమావత్ 803, ఆర్ భార్గవి 2,032, బుదావత్ నవ్యశ్రీ 3,018, జీ పావని 3,179 ర్యాంకులతో సత్తాచాటారు. గిరిజన గురుకులాల నుంచి బానోత్ శశికుమార్ 414, ధరావత్ సుమన్ 718, గుగులోత్ లక్ష్మీతేజ 724, చౌహన్ అరుణ్‌కుమార్ 921, గోదావత్ మునినాయక్ 939 ర్యాంకులను సొంతం చేసుకున్నారు.