mt_logo

తెలంగాణ బీజేపీలో న‌ల్లారి చిచ్చు.. ఆంధ్రా నేత‌ల అవ‌స‌రం ఏమొచ్చిందని నాయ‌కుల అసంతృప్తి!

రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి మార్పు, ఈట‌ల‌కు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ కమిటీ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌డంతో మూడు వ‌ర్గాలుగా చీలిపోయిన తెలంగాణ బీజేపీలో న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కొత్త చిచ్చుపెట్టారు. తాము క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పుకొని తిరిగే బీజేపీ నేత‌లే ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ రోడ్డున‌ప‌డ్డారు. నిత్య క‌ల‌హాలు.. ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌ల‌తో కాంగ్రెస్‌కు తామేమీ త‌క్కువ కాద‌ని నిరూపించుకొంటున్నారు. హ‌స్తం పార్టీ బాట‌లోనే బీజేపీ నేత‌లు బ‌హిరంగంగానే నోరుజారుతున్నారు. నిండు అసెంబ్లీలో తెలంగాణ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌ను.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే చీక‌టైపోతుంద‌ని దుర‌హంకార వ్యాఖ్య‌లు చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని కిష‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారానికి ఎందుకు పిలిచారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌లో ఆంధ్ర నేత‌ల అవ‌స‌రం ఏమొచ్చిందంటూ పార్టీ పెద్ద‌ల‌పై కిందిస్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు  మండిప‌డుతున్నారు. 

కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు పిలిచారు..?

స‌మైక్య రాష్ట్రంలో సీఎంగా ఉన్న న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ‌పై విషం చిమ్మారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ‌కు రూపాయి కూడా ఇవ్వ‌న‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ నాయ‌కుల‌కు పాల‌న చేత‌గాద‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే ఆ ప్రాంత‌మే చీక‌టి అవుతుంద‌ని అవ‌హేళ‌న చేశారు. అలాంటి నాయ‌కుడు టీబీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌య్యారు. వేదిక‌పైన ఆసీనులై.. స్పీచ్ కూడా ఇచ్చారు. ఇదంతా చూసిన బీజేపీలోని తెలంగాణ‌వాదుల‌కు ఇది మింగుడుప‌డ‌డం లేదు. ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. స‌భ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయి సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. తెలంగాణ‌ను అవ‌మానించిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని స్టేజిపై చూసి త‌ట్టుకోలేక‌పోయాన‌ని ఆమె వాపోయారు. అనంత‌రం అధిష్ఠానం నిర్వ‌హించిన స‌మావేశంలోనూ కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన‌డంపై టీబీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. తెలంగాణ‌లో ఆంధ్రా నేత‌ల పెత్త‌నం వ‌ద్దే వ‌ద్ద‌ని తెగేసి చెప్పారు.  తెలంగాణ‌ను అవ‌మానించిన నాయ‌కుల‌ను మ‌రోసారి స‌భ‌లు, స‌మావేశాల‌కు పిలిస్తే తాము పార్టీలో ఉండ‌బోమ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.