
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కరెంటు వ్యాఖ్యలపై యావత్తు తెలంగాణ రైతాంగం మండిపడుతున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఏ మూలకు సరిపోతదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ 24 గంటల కరెంటు ఇయ్యంగ.. మేం కాంగ్రెసోళ్ల మాటలు ఎందుకు నమ్ముతం అని అంటున్నారు. 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్ తీరుకు నిరసనగా తెలంగాణలోని ఊరూరా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రైతులు రోడ్డెక్కి మరీ ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ గ్రామాల్లోకి రానివ్వబోమని శపథం చేస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి ఆసక్తికర అనుభవం ఎదురైంది. ఆయనతో చిట్‌చాట్‌గా ముచ్చటించిన వృద్ధులు.. కాంగ్రెస్ తీరును తమదైన శైలిలో ఎండగట్టారు.
అన్ని మంచిగ చేస్తున్న కేసీఆర్‌కే ఓటేస్తాం..
కేసీఆర్ సారు కన్నుకొట్టినంతసేపుగూడ పోకుండా కరెంటు ఇస్తున్నడు.. అయినా ఒక్కోతాప నీళ్లు సాల్తలేవు.. మరి గీ కాంగ్రెసోళ్లు మూడు గంటలకోపారి ఇత్తముంటున్నరు.. అట్లిత్తే నీళ్లు ఏ మూలకు సాల్తయ్.. పొలం ఎట్టా పార్తది..ఆ కాంగ్రోసోళ్ల మాటలెట్లా నమ్ముతం అని అంజిలమ్మ అనే వృద్ధురాలు కాంగ్రెస్‌ను కడిగిపారేసింది. కేసీఆర్ పంట పంటకూ ఎకరానికి పదివేలు ఇత్తుండు..మా పేరుమీద భూమి పిల్లల పేరుమీద పట్టాజేసినం..వాళ్లకు మంచిగ పైసలు పడ్తున్నయ్.. మాకు నెలకాంగనే రూ.2వేల పింఛన్ పడ్తంది. అని సత్యమ్మ, శాంతమ్మ మురుసుకుంట జెప్పిన్రు. ఇన్ని సౌలతులు జేస్తున్న కేసీఆర్ సార్‌కు ఓటేస్తామని, కాంగ్రెసోళ్లకు ఎవ్వరం ఓటెయ్యమని తెగేసి చెప్పారు.