–ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేసిన గవర్నర్ తమిళిసై తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
నైతిక విలువలుంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలి
అత్యంత వెనుకబడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యూల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణలను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ ఎంబీసీ కులాలను, ఎస్టీ(ఎరుకల) సమాజాన్ని అగౌరవ పర్చినట్టే అని స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచిన గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్ గా తెలంగాణ గవర్నర్‌గా నియమించబడ లేదా..? అని అడిగారు. తమిళిసైకి నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
సర్కారియా కమిషన్ సూచనలకు విరుద్ధం
సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పలు మార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా సర్కారియా కమిషన్ సూచనలకు విరుద్ధం. రాజకీయాల నుండి నేరుగా గవర్నర్ అయిన తమిళిసై కి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదు. ఆమె నిర్ణయం అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా అని పేర్కొన్నారు.