“మమ్మల్ని కలవనీయరా.. మాకు అవకాశమివ్వరా”.. అమెరికాలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారైలలో ఇప్పుడు ఇవే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న విషయం మనకి తెలిసిందే.. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి అమెరికాకి రావడంతో సహజంగానే పలువురు ఎన్నారైలు రేవంత్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారైలకు ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఏర్పడ్డది. రేవంత్ చుట్టూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎన్నారైలు చేరి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారైలను పక్కకు తోసేస్తున్నారు.
రేవంత్ రెడ్డిని మొత్తం ఆంధ్ర టీడీపీ ఎన్నారై కార్యకర్తలు కమ్మేసారని కాంగ్రెస్ ఎన్నారై విభాగానికి చెందిన పలువురు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతుపై బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మా తెలంగాణ సీఎం వచ్చినప్పుడు మమ్మల్ని కలవనియ్యకపోతే మా సమస్యలు ఎలా చెప్పుకోవాలి, మాకు సంబంధించిన అంశాల గురించి ఎలా చర్చించాలని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీరే పక్కన ఉంటే మా వాళ్ళు ఎలా కలుస్తారు.. బాబు, జగన్ వచ్చినప్పుడు మేము అలానే వెంటపడ్డామా అని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు అని పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే ఆగ్రహంగా అన్నారు. పైపెచ్చు సీఎం అయ్యుండి టీడీపీకి ఎక్కువగా మద్దతు తెలిపే ఒక సామాజికవర్గానికి చెందిన మీటింగ్‌కు వెళ్ళడం ఏంటని రేవంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ మరక అంటుకున్న నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్ళ అతిప్రేమ వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని వాపోతున్నారు. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు (సహచరుడు) రేవంత్ మీద టీడీపీ వాళ్ళు చూపిస్తున్న అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చేలా ఉంది.