హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం :
బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు తదితర బీసీ ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని సీఎం ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతను ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలన్నారు. జూన్ 9 నాడు జరుపుకునే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో… సబ్ కమిటీ సిఫారసు చేసిన ఇప్పటికీ ఆదుకోని బీసీ ఎంబీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.