ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్ లో దాదాపు 40 నుంచి 50 అంశాల మీద చర్చించనున్నది. ఇందులో భాగంగా..
– భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.
– రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.
– రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది.
– అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.