mt_logo

స్టార్టప్ తెలంగాణ..

By: కట్టా శేఖర్‌రెడ్డి:

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తిరుగులేని రాష్ట్రంగా నిర్మించాలన్నా, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచనలన్నీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలన్నా అభివృద్ధి పథంలో తెలంగాణ తలెత్తుకుని నిలబడాలన్నా తెలంగాణ ప్రభుత్వం నైతికంగా మరింత బలపడడం అవసరం. అందుకు వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం అవసరం. తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించి, చూశారా… మేము అప్పుడే చెప్పాం అని పగలబడి నవ్వాలని చూస్తున్న శక్తులకు చెంపపెట్టుగా ఈ ఫలితాలు ఉండాలి. తెలంగాణ సమాజం పరిణతితో, చెదరక బెదరక, నిలకడగా వ్యవహరిస్తున్నదని చాటడానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలి.

టీ-హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఒక మంచి మాట చెప్పారు. ఒక కొత్త రాష్ట్రం(స్టార్టప్ స్టేట్) ఇంత తొందరగా కొత్త పారిశ్రామికవేత్తల(స్టార్టప్)ను తయారుచేసే ఇంత అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ముమ్మాటికీ ఇది స్టార్టప్ స్టేట్. ఒక స్టార్టప్ కంపెనీ పడే కష్టాలన్నీ తెలంగాణ పడుతున్నది. పదిహేడు మాసాల తర్వాత కూడా విభజన పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదు. కేంద్రం వలపక్షం వహిస్తున్నది. బీజేపీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పక్షమే వహిస్తున్నది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలు తెలంగాణకు, పనులు ఆంధ్రకు చేసిపెడుతున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులేమో ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు.

తెలంగాణకు చేయాల్సిన సహాయ సహకారాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మాని, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఏకైక ఎజెండాతో మాటలు, చేతలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేయాల్సి ఉండీ చేయకుండా తాత్సారం చేస్తున్న పనులు అనేకం. ఒకటి, హైకోర్టు విభజనకు కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేదు. రెండు, ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ కాలక్షేపాన్ని అనంతంగా కొనసాగిస్తున్నది. పదిహేడు మాసాలు పూర్తవుతున్నా ఇంకా కొన్ని విభాగాలు వివరాలే ఇవ్వని పరిస్థితి. మూడు, విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలులో పేర్కొన్న 89 సంస్థలు, పదో షెడ్యూలులో పేర్కొన్న 107 సంస్థలలో సగం కూడా ఇప్పటికి విభజన పూర్తి కాలేదు.

ఈ సంస్థల విభజనపై ఏర్పాటు చేసిన షీలా భిడే కమిటీ ఇప్పుడు పనిచేస్తున్నదో లేదో ఎవరికీ తెలియదు. ఈ సంస్థల విభజనకు సంబంధించి ఎటువంటి కాల పరిమితి విధించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వివిధ రకాల పేచీలు లేవనెత్తుతున్నది. నాలుగు- కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 1. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం స్థాపించడానికి కృషి చేస్తామని కేంద్రం చట్టంలో హామీ ఇచ్చింది. 2. ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ పెట్టడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 3. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పింది. 4. తెలంగాణలో రైల్వే కోచ్ ఫాక్టరీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చట్టంలో పొందుపరిచారు. 5. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇవేవీ ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఈ హామీలు సాధించడానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం చేసింది ఏమీ లేదు. ఐదు-తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఆ పని బీజేపీ ప్రభుత్వమే చేసింది. ఎంత దుర్మార్గంగా అంటే భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలను ఆంధ్రలో కలిపి భద్రాచల రాముడిని మాత్రం తెలంగాణలో ఉంచారు. భద్రాచలం నుంచి ఖమ్మం జిల్లాలోని గోదావరి ఉత్తర తీర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆంధ్ర చెక్‌పోస్టును దాటుకుని వెళ్లాలి. కనీసం భద్రాచలం నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రంతో పంచాయితీ ఇంకా తెగలేదు. ఉద్యోగుల విభజన ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తెలంగాణలో అక్రమంగా తిష్టవేసిన ప్రాంతేతర ఉద్యోగులు ఇప్పటికీ వివిధ స్థాయిల్లో చక్రాలు తిప్పుతూనే ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన జరగనివ్వడం లేదు.

ఉమ్మడి సంస్థల నిర్వహణకు సంబంధించి తెలంగాణపై కేసులు వేసి కోర్టుల ద్వారా సాధింపులకు పాల్పడుతున్నది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పేచీ లేవనెత్తని సందర్భం, కేంద్రానికి ఫిర్యాదులు చేయని సందర్భం లేదు. కరువులో నదీ జలాల పంపిణీ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. విభజన ప్రక్రియ మునుపెన్నడూ ఏ రాష్ట్రంలో జరుగని రీతిలో సాగదీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం బలంగా ఉండడం తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వానికి నైతిక బలాన్ని ఇవ్వడం అవసరం. తెలంగాణ నిలదొక్కుకోవడానికి ఇంకా చాలా జరగాల్సి ఉంది.

ప్రభుత్వాన్ని బలహీన పరిచే ఎటువంటి పరిణామమూ ఇప్పుడు తెలంగాణకు మేలు చేయదు. సామాజిక విద్వేషాలతో రాజకీయ విధ్వంసకారులు కొందరు, ఒక వర్గం మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాచాలత్వం ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును మునుపెన్నడూలేని విధంగా ఆగం పట్టించిన తెలంగాణ తెలుగుదేశం నడమంత్రపు నాయకుడొకరు ఇటీవల ఒక ఊరెళ్లి అక్కడి టీఆర్ఎస్ నాయకులపై నోటికొచ్చిందల్లా వాగాడు. అదే సభలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఈయన మనల్ని బాగుచేయడానికి వచ్చినట్టుగా లేదు. ఉన్నది ఆగం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. ఈయనను వెంటేసుకుని తిరిగితే ఉన్న నాలుగోట్లూ గాలిలో కలిసినట్టే అని టీడీపీ నాయకుడు పక్కనే ఉన్న విలేకరులతో అన్నారట. మళ్లోసారి మన ఊరికి ఈయనను తీసుకురావద్దు.

ఇంత అధ్వాన్నంగా మాట్లాడితే ఇక పలకరించేవాడు కూడా ఉండడు అని మరో నాయకుడు చెప్పారట. సభ్యత, సంస్కారం, నీతీగీతీ ఏమీ లేని నాయకులు తాము ఎప్పటికీ ఎదగలేరు. అందువల్ల ఎదుటివారికి మసిబూసి వారిని తమస్థాయికి దిగజార్చాలని చూస్తారు. తెలంగాణ వ్యతిరేక మీడియా కూడా ఇటువంటివారికి పెద్ద పీట వేస్తుంది. వారు ఏమి వాంతి చేసుకున్నా పతాక శీర్షికలకు ఎక్కించి తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ నాయకత్వంపై తమ అక్కసును తీర్చుకుంటున్నది. ఇవేవీ అసాధారణ పరిణామాలు కావు. కానీ కొందరు తెలంగాణ మేధావులు సైతం వారు సృష్టించిన భావజాల గందరగోళంలో పడి కొట్టుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర మీడియా తెలంగాణపై గత నాలుగైదు దశాబ్దాలుగా ఉపయోగించిన థాట్ పోలీసింగ్ విధానాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాయన్న విషయాన్ని తెలంగాణ మేధావులు ఇంత తొందరగా ఎలా మర్చిపోయారన్నది ప్రశ్న.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని, తెలంగాణ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు విమర్శలకు అతీతమని చెప్పడం లేదు. కానీ ఎవరు అందించిన వాదనలు ఎవరు అందిపుచ్చుకుంటున్నారన్నదే ప్రశ్న. ఎవరు సృష్టించే అయోమయాన్ని ఎవరు ఎక్కించుకుంటున్నారన్నదే అసలు సమస్య. తెలంగాణ ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు మనం అంతా ఒక్కటే అన్న స్పృహ ఎందుకు ఉండటం లేదు అన్నదే ప్రశ్న. మొండోడు రాజుకంటే గొప్ప అంటే మొండోడు రాజంతటివాడని కాదు. అలా అని ఎవరయినా అంటే అది అజ్ఞానం, మూర్ఖత్వం. మొండోడు ఎప్పుడూ రాజు కాలేడు. మొండోడు ఎవడినీ లెక్కచేయడు. అటువంటివాడిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు. అటువంటివాడిని చూస్తే జనం పారిపోతారు.

వినదగిన విధంగా చెప్పడం, విమర్శ సహేతుకంగా అనిపించడం అనేది రాజకీయాల్లో ఒక నాయకుడి మనుగడను నిర్ణయిస్తుంది. విన్నా వినకపోయినా పర్వాలేదు, నాకు తోచింది నేను మాట్లాడతా అంటే జనం నేలకేసి కొడతారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఈ సోయి తెచ్చుకోకపోతే వారిని ఈ ప్రాంతంలో గతించిన ఖాతాలో లెక్కవేయవలసిందే. ఇటువంటి వారిని భుజాన మోసినంతకాలం బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో సాధించేదేమీ ఉండదు.

కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శల్లో టీడీపీపై పైచేయి సాధించాలన్న ఆరాటంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి భావజాల దారిద్య్రం ఉందన్నది నిజమే కానీ ఓటెయ్యకపోతే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తామని చెప్పేంత దారిద్య్రం ఉందనుకోలేదు. మరికొందరు నాయకులు టీడీపీ నాయకులతో పోటీపడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతిష్ఠను మెట్టుమెట్టు పెంచుకుంటూ పోవాలని ఒక్కసారిగా ఆరేడంతస్తులు కట్టడం సాధ్యం కాదని ఇంతకాలంగా రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకపోవడం విషాదం. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత చేసిన ఒక్క మంచి పని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను గుర్తు చేసుకునే ప్రయత్నంలో కొందరు మేధావులను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం. ఆ మేధావులతో నాలుగు మాటలు చెప్పించుకోవడం. విన్నారో పన్నారో తెలియదు కానీ ఈ సన్నివేశం కాంగ్రెస్‌లో కొత్త. వరంగల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొండంత రాగం తీసింది.

ఏదో బ్రహ్మాండం బద్దలయిపోతుందన్నంత సీను క్రియేటు చేశారు. ఢిల్లీ పెద్దలు, ఇక్కడి పెద్దలు అందరూ కలిసి రోజుల తరబడి సమావేశాలు, రహస్య భేటీలు, అభిప్రాయ సేకరణలు… ఏ దిక్కూ లేక చివరికి రాజయ్యను ఎంపిక చేశారు. ఏం లాభం….రాజయ్య ఖర్మ అలా కాలిపోయింది. మళ్లీ అభ్యర్థి మార్పు. హైదరాబాద్ నుంచి దిగుమతి. కాంగ్రెస్ ఎంత డోల్‌డ్రమ్స్‌లో ఉందో ఈ పరిణామాలు చెప్పడం లేదా? వీరిని గెలిపించాలని, వీరు గెలవాలని ఎవరయినా అనుకోవడానికి ఒక్క బలమైన కారణమైనా ఉందా? వరంగల్ ఎన్నికలో వీరెవరికి ఓటు వేసినా తెలంగాణకు కలిగే లాభం లేదు. పద్నాలుగేళ్లుగా ఉద్యమంలో పనిచేసిన ఒక స్థానిక సామాన్య కార్యకర్తకు, ఎన్నికల కోసమే ఎక్కడెక్కడి నుంచో దిగబడిన ఇద్దరు పెద్దమనుషులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తిరుగు లేని రాష్ట్రంగా నిర్మించాలన్నా, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచనలన్నీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలన్నా అభివృద్ధి పథంలో తెలంగాణ తలెత్తుకుని నిలబడాలన్నా తెలంగాణ ప్రభుత్వం నైతికంగా మరింత బలపడటం అవసరం. అందుకు వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం అవసరం. తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించి, చూశారా… మేము అప్పుడే చెప్పాం అని పగలబడి నవ్వాలని చూస్తున్న శక్తులకు చెంపపెట్టుగా ఈ ఫలితాలు ఉండాలి. తెలంగాణ సమాజం పరిణతితో, చెదరక బెదరక, నిలకడగా వ్యవహరిస్తున్నదని చాటడానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *