mt_logo

గోదారమ్మ సాక్షిగా రైతన్నలకు వరంగా మారిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు

• కళకళలాడుతున్న గోదావరి బేసిన్ జలాశయాలు

• శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లకు పెరిగిన ప్రవాహాలు

• రైతన్నలకు వరంగా మారిన వర్షాలు 

• జోరుగా వ్యవసాయ పనులు

హైదరాబాద్, జూలై,25:  రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి బేసిన్ ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1,21,008 ఇన్ ఫ్లో ఉండగా… 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను,63.47 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇప్పటికే నిండిన నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22.440 క్యూసెక్కుల వరద వస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద వస్తుండగా, 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.48 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తుంది. 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు.

సింగూరు ప్రాజెక్టు లో ఇప్పటివరకు 21.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 17.80 టీఎంసీలు. అదేవిధంగా శ్రీరామ సాగర్ ప్రాజెక్టులో 63.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 7.60 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.01 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు రిజర్వాయర్ లో 24.07 టీఎంసీలు ప్రాజెక్టు సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 12.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా మిడ్ మానేరు రిజర్వాయర్ లో 27.50 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా  ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు  రైతన్నలకు వరంగా మారాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.  రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది.