mt_logo

బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదు: శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదు అని స్పష్టం చేస్తూ.. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ మారుతున్న వారు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదు. బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు జై కొట్టిన వారు ఇపుడు పార్టీఏ ఉండదన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు నిర్ణయించాలి తప్ప కొందరు ఎమ్మెల్యేలో, నాయకులో కాదు అని పేర్కొన్నారు.

రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇపుడు ఏ స్థాయికి చేరుకుంది.. కాంగ్రెస్‌కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా? మా పార్టీకి గొప్ప ఉద్యమ చరిత్ర ఉంది.. త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పుట్టింది.. సమయం వచ్చినపుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని గుర్తు చేశారు.

పార్టీ మారే వారు తొందరపడుతున్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కే కాదు ఇంకా పద్నాలుగు పార్టీలకు సీట్లు రాలేదు. మోడీ కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీద పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఈ విషయాలు గమనిస్తారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఆ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లా ఉండవు అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు తెలివైన వారు.. వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారు.. బీఆర్ఎస్‌కు 65 లక్షల మంది సభ్యత్వం ఉంది.. ఆషామాషీగా తుడిచి పెట్టలేరు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలి అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ దేశంలో అభివృద్ధికి రోల్ మోడల్ అయ్యింది.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెబుతారు. ఎమ్మెల్యేలు ఇష్టం లేకుంటే పోండి.. కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించకండి. పార్టీ ఉండదు అని శాపనార్ధాలు పెట్టడం మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు కొత్త కాదు.. ఒక్కసారి ఓడిపోగానే పార్టీల పని అయిపోతుందా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ను ఉద్యమంలో కూడా చంపాలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావు. ఓడిపోయినంత మాత్రాన ఎదో జరుగుతుందని ఊహించుకోవడం సరికాదు. మాకు 33 జిల్లాల్లో, ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి అని తెలిపారు.

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా.. ఈ పార్టీ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది.. కేసీఆర్ ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా.. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ ఉంది అని స్పష్టం చేశారు.

 దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా పెట్టండి..మేము ఏ పార్టీ అంతాన్ని కోరుకోలేదు. ప్రజలను మెప్పించేలా కాంగ్రెస్ నేతలు పాలన చేయాలి కానీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టాలి. మాకు రాజకీయాల కన్నా తెలంగాణ అభివృద్ధి అస్తిత్వం ముఖ్యం అని అన్నారు. 

తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మళ్ళీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉంది. తప్పులుంటే సరిదిద్దుకుంటాం.. మేము దేవుళ్ళం కాదు.. అన్నీ కరెక్ట్ చేశామని చెప్పడం లేదు. అనేకసార్లు అనేక మెట్లు దిగాం.. భవిష్యత్‌లో మా లోపాలు సవరించుకుంటాం అని తెలిపారు.

బీఆర్ఎస్ సబ్బండ వర్గాల పార్టీ. పార్టీ మారుతున్న వారు తమ సొంత బలం మీద గెలిచాం అనుకుంటే రాజీనామా చేసి గెలవండి.. ఉద్యమ పార్టీపై నిందలు వేయడం సరికాదు. కేసీఆర్ తెలంగాణకు మంచి చేయడమే కాంగ్రెస్ నాయకులకు తప్పుగా కనిపిస్తోందా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.