mt_logo

బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: శ్రీనివాస్ గౌడ్

బీసీ కులగణనపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ పార్టీ నోట విన్నా ఓబీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నాయి.. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చింది అని ఎద్దేవా చేశారు.

బ్రిటీష్ కాలంలో కులగణన జరిగింది. జంతువులకు లెక్కలు ఉన్నాయి. 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదు. ఓబీసీల కులగణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడ్డారు అని అన్నారు.

కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. బీహార్, మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదు. ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి అని పేర్కొన్నారు.

బీహార్‌లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలింది. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేయాలి. దేశంలో అన్ని వర్గాల లెక్కలు ఉండాలి. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ వలనే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.